దులీప్‌ ట్రోఫీకి రికీ భుయ్, అక్షత్‌

7 Aug, 2019 08:08 IST|Sakshi

భారత్‌ బ్లూ, గ్రీన్, రెడ్‌ జట్ల ప్రకటన 

17 నుంచి బెంగళూరులో టోర్నీ  

న్యూఢిల్లీ: భారత దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ 2019–20 ఆరంభ టోర్నీ అయిన దులీప్‌ ట్రోఫీలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఆడనున్నారు. భారత్‌ ‘గ్రీన్‌’ జట్టుకు హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌ అక్షత్‌ రెడ్డి... ‘బ్లూ’ జట్టుకు ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌ ఎంపికయ్యారు. ఈ రెండు జట్లతో పాటు భారత్‌ ‘రెడ్‌’ కూడా పాల్గొనే ఈ టోర్నీ మ్యాచ్‌లు ఈ నెల 17 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు జరుగుతాయి. మ్యాచ్‌ లన్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే నిర్వహిస్తారు. ‘బ్లూ’ జట్టుకు శుబ్‌మన్‌ గిల్‌... ‘గ్రీన్‌’ జట్టుకు ఫయాజ్‌ ఫజల్‌... ‘రెడ్‌’ జట్టుకు ప్రియాంక్‌ పాంచల్‌ నాయకత్వం వహిస్తారు. 

గత మూడు సీజన్ల పాటు డేనైట్‌ ఫార్మాట్‌లో పింక్‌ బాల్‌తో జరిగిన ఈ ఫస్ల్‌క్లాస్‌ టోర్నీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే జరుగనుంది. రెడ్‌ బాల్‌తో డే ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌ ఆపరేషన్స్‌) సాబా కరీమ్‌ మాట్లాడుతూ ‘చిన్నస్వామి స్టేడియంలో ఫ్లడ్‌లైట్లున్నప్పటికీ లైవ్‌ కవరేజ్‌ లేకే డేనైట్‌ మ్యాచ్‌లు ఆడించడం లేదు. అయితే సెప్టెంబర్‌ 5 నుంచి 9 వరకు జరిగే ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది’ అని చెప్పారు. భారత్‌లో ఇకపై పింక్‌ బాల్‌తో డే నైట్‌ టెస్టులకు దారులు మూసుకుపోయినట్లేనా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘అలా అని ఏం లేదు. అంతా కోరితే మళ్లీ ఆ ఫార్మాట్‌లోనే మ్యాచ్‌లు జరగొచ్చు. ఎవరైనా డేనైట్‌ కావాలని బోర్డును సంప్రదిస్తే భారత్‌ ‘ఎ’ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు పింక్‌బాల్‌తో నిర్వహించవచ్చు. కానీ అందరు అదే కోరరు’ అని అన్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ డే ఫార్మాట్‌లోనే జరగనున్నాయని అందుకే మళ్లీ దేశవాళీలోనూ ఈ పద్ధతికే మొగ్గుచూపినట్లు బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు