‘మ్యాక్స్‌వెల్‌ వైఫల్యానికి రిషబ్‌ పంతే కారణం’

21 May, 2018 17:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీ20 అంటేనే ధనాధన్ ఆట..ప్రేక్షకులకు అత్యంత వినోదాన్ని అందించడమే టీ20 క్రికెట్‌ ముఖ్య ఉద్దేశం. ఈ క‍్రమంలోనే బ్యాట్‌కు బంతికి ఆసక్తికర పోరు జరుగుతూ ఉంటుంది. మ్యాచ్‌ ప్రత్యర్థి చేతిలో ఉన్నా.. ఒక్కసారిగా గేర్ మార్చి విధ్వంసం సృష్టించాలి. ఇలాంటి ఆటకు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ పెట్టింది పేరు‌. ఈ ఆటగాడికి ఐపీఎల్‌ అనుభవం ఉండడంతో ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ. 9 కోట్లు పోసి వేలంలో దక్కించుకుంది. కానీ ఏం లాభం కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయిన మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించడంలో విఫలమయ్యాడు. దీనికి తోడు మిగతా ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంలో విఫలమవ్వడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ లీగ్‌ దశలోనే నిష్క్రమించింది.

చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టు మ్యాక్స్‌వెల్‌ పేలవ ప్రదర్శనపై ఢిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ స్పందించాడు. ఈ మాజీ ఆసీస్‌ కెప్టెన్‌ తోటి క్రికెటర్‌ను వెనుకేసుకొచ్చాడు. ఐపీఎల్‌కు ముందు జరిగిన సిరీస్‌లోనూ మ్యాక్స్‌ అద్భుతంగా ఆడాడని, ఐపీఎల్‌లోనే బాగా ఆడలేకపోయాడని, అతను రెగ్యులర్‌గా ఆడే నాలుగో స్థానంలో పంత్‌ ఆడటంతో, బ్యాటింగ్‌ స్థానాలు పదేపదే మార్చాల్సివచ్చిందన్నారు. దాంతో మ్యాక్స్‌వెల్‌ సరిగా ఆడలేకపోయాడని తెలిపాడు. ముందుగా అనుకున్న ప్రకారం మ్యాక్స్‌ నాలుగో స్థానంలో, పంత్‌ ఐదో స్ధానంలో ఆడాల్సి ఉందన్నాడు. సహచర ఆటగాడు ఆరోన్‌ ఫించ్‌ వివాహం సందర్బంగా తొలి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఆడలేదని,  ఆ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చిన పంత్‌ విజయవంతమవడంతో అతన్నే కొనసాగించామని పాంటింగ్‌ పేర్కొన్నాడు.

కానీ వాస్తవానికి ఆరంభ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ బదులు నాలుగో స్థానంలో ఆడింది విజయ్ శంకర్. ఆ మ్యాచ్‌లో అతడు 13 బంతుల్లో 13 పరుగులు చేసి అవుటయ్యాడు. పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాణించాడు.


 

మరిన్ని వార్తలు