రియో మళ్లీ వెలిగింది

9 Sep, 2016 01:25 IST|Sakshi
రియో మళ్లీ వెలిగింది

 ఘనంగా పారాలింపిక్స్ ప్రారంభోత్సవం
 రియో డి జనీరో: ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో పారాలింపిక్స్ ప్రారంభ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. భారత కాలమానప్రకారం గురువారం తెల్లవారుజామున మరకానా స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో సాంబా నృత్యాలతో పాటు భారీ బెలూన్‌లు, కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులతో రియో నగరం జిగేల్‌మంది. ఒలింపిక్స్ ముగిసిన అనంతరం సంప్రదాయంగా ఈ గేమ్స్ జరిగే విషయం తెలిసిందే. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రేక్షకులను సాంబా కళాకారులు ఉర్రూతలూగించగా స్టేడియం మధ్యలో రియో బీచ్ దృశ్యాలను సృష్టించడం అబ్బురపరిచింది.
 
  ‘ప్రతి ఒక్కరికీ హృదయం ఉంటుంది’ అనే పేరిట చేసిన ప్రదర్శన అమితంగా అలరించింది. ఈనెల 18 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. మరోవైపు నూతనంగా అధ్యక్ష పదవిని అలంకరించిన మైకేల్ టెమెర్‌ను వ్యతిరేకిస్తూ కొందరు ప్రేక్షకులు ప్లకార్డులు ప్రదర్శించారు. శారీరక వైకల్యం, పాక్షిక అంధత్వం, పక్షవాతం కలిగిన అథ్లెట్లు ఈ గేమ్స్‌లో పాల్గొంటారు. ఓవరాల్‌గా 159 దేశాల నుంచి ఈ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా 4,342 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇందులో ఇద్దరితో కూడిన అంతర్జాతీయ శరణార్ధి జట్టు కూడా ఉంది. భారత్ నుంచి ఎన్నడూ లేని విధంగా 17 మంది అథ్లెట్లు తమ సత్తాను పరీక్షించుకోనున్నారు.
 
  డోపింగ్ ఆరోపణలతో రష్యా అథ్లెట్లను ఇందులో పాల్గొనకుండా బహిష్కరించారు. 154 దేశాల్లో ఈ క్రీడలు ప్రసారం కాబోతున్నాయి. అంగవైకల్యం కలిగిన వారిపై ఉన్న దృష్టికోణాన్ని ఈ క్రీడల ద్వారా తమ అథ్లెట్లు పటాపంచలు చేస్తారని అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఫిలిప్ క్రావెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. రియో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం వీటి టిక్కెట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. అయితే 1984 అనంతరం ఐఓసీ చీఫ్ లేకుండానే ఈ గేమ్స్ ప్రారంభమయ్యాయి. పశ్చిమ జర్మనీ మాజీ అధ్యక్షుడు వాల్టర్ షీల్ అంత్యక్రియల్లో పాల్గొన్న థామస్ బాచ్ ఈ వేడుకలకు గైర్హాజరయ్యారు.
 

మరిన్ని వార్తలు