సుశీల్‌కు అవకాశం దక్కేనా !

6 Jun, 2016 00:50 IST|Sakshi
సుశీల్‌కు అవకాశం దక్కేనా !

‘రియో’ ట్రయల్స్‌పై నేడు కోర్టు తీర్పు

న్యూఢిల్లీ:  ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన రెజ్లర్ సుశీల్ కుమార్ మరో ఒలింపిక్స్‌కు వెళ్లగలడా... అసలు తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశమైనా దక్కుతుందా... సోమవారం ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఇది తేలిపోనుంది. రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున పంపే రెజ్లర్ ఎంపిక కోసం సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలంటూ సుశీల్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి భారత్‌కు బెర్త్ ఖాయం చేసిన నర్సింగ్ యాదవ్‌నే పంపిస్తామంటూ రెజ్లింగ్ సమాఖ్య వాదిస్తుండగా... ట్రయల్స్ తర్వాతే ఆటగాడి పేరును ఖరారు చేయాలని సుశీల్ చెబుతున్నాడు. వాదనల అనంతరం దీనిపై నేడు తీర్పు వెలువడనుంది.


పేస్‌కూ పరీక్ష...
మరోవైపు ఏడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్న టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విజేతగా నిలిచినా... పేస్ ఒలింపిక్స్ భవిష్యత్తు కూడా అతని చేతుల్లో లేదు. సోమవారం వెలువడే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో (డబుల్స్) రోహన్ బోపన్న టాప్-10లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు తన రియో భాగస్వామిని ఎంచుకునే అవకాశం బోపన్నకు ఉంటుంది.

మరిన్ని వార్తలు