పూర్తి సన్నద్ధంగా ఉన్నాం: రిషభ్‌ పంత్‌

11 Sep, 2019 17:15 IST|Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ కీపింగ్‌ నైపుణ్యాలతో పోలిక తెచ్చే ప్రశంసల కంటే ఆటపైనే ఎక్కువగా దృష్టి సారించానని భారత యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ అన్నాడు. ధోని ఆట తీరును తాను అమితంగా ప్రేమిస్తానని.. అదే విధంగా ప్రతీరోజూ తనను తాను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. జట్టు విజయాల కోసం కఠినంగా శ్రమిస్తానని.. తద్వారా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే అవకాశం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాని తెలిపాడు. వెస్టిండీస్‌ టూర్‌ను విజయవంతంగా ముగించిన కోహ్లి సేన సెప్టెంబరు 15 నుంచి దక్షిణాఫ్రికా సిరీస్‌తో బిజీ కానున్న విషయం తెలిసిందే. ధర్మశాలలో జరిగే టీ20 మ్యాచ్‌తో సిరీస్‌ ప్రారంభించనున్న టీమిండియా...మూడు టీ20 మ్యాచ్‌లతో పాటు టెస్ట్‌ మ్యాచ్‌ల్లోనూ ప్రొటీస్‌ జట్టుతో తలపడనుంది. 

ఈ క్రమంలో రిషభ్‌పంత్‌ మాట్లాడుతూ...‘ వెస్టిండీస్‌లో మేము రాణించాము. టీమిండియా సాధించే మరిన్ని విజయాల్లో భాగస్వామిని కావాలన్నదే నా లక్ష్యం. దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న సిరీస్‌ కోసం బాగానే ప్రాక్టీస్‌ చేశాం. మానసికంగా కూడా సన్నద్ధమయ్యాము. సొంత ప్రేక్షకుల మద్దతు ఎలాగూ ఉంటుంది. అయితే ప్రత్యర్థి జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు’ అని వ్యాఖ్యానించాడు. కాగా సెలక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకానికి, అంచనాలకు అనుగుణంగా రిషభ్‌ పంత్‌ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా వికెట్‌ కీపర్‌గా తన పేరును లిఖించుకున్న పంత్‌....తాజాగా ముగిసిన వెస్టిండీస్‌ టూర్‌లో భాగంగా టెస్టుల్లో సైతం ధోని పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో వేగంగా 50 అవుట్‌లు చేసిన భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ధోని 15 టెస్టుల్లో ఈ ఫీట్‌ సాధించగా పంత్‌ 11 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరి.. ధోని స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు.

మరిన్ని వార్తలు