పంత్‌ ఇంగ్లండ్‌ పయనం

13 Jun, 2019 05:35 IST|Sakshi
రిషభ్‌ పంత్‌

భారత మేనేజ్‌మెంట్‌ ముందుజాగ్రత్త

జూన్‌ 30లోగా ధావన్‌ కోలుకునే అవకాశం

నాటింగ్‌హామ్‌: ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అనూహ్యంగా గాయపడటంతో భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. అవసరమైతే మరో ఆటగాడు అందుబాటులో ఉంటే మంచిదని భావిస్తూ అందుకోసం యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ను ఎంపిక చేసింది. ప్రపంచ కప్‌ జట్టును ఎంపిక చేసిన సమయంలో ప్రకటించిన రిజర్వ్‌ ఆటగాళ్లలో పంత్‌ కూడా ఒకడు. రిషభ్‌ గురువారం సాయంత్రం ఇంగ్లండ్‌ చేరుకుంటాడు. అయితే గాయం నుంచి కోలుకునే వరకు ధావన్‌ను జట్టుతోనే కొనసాగించాలని భారత్‌ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఐసీసీ నిబంధనల ప్రకారం పంత్‌ టీమిండియాతో చేరే అవకాశం లేదు. అతను జట్టుతో ఉండకుండా మాంచెస్టర్‌లో ఉంటాడని, ప్రస్తుతానికి పంత్‌ ‘స్టాండ్‌ బై’ మాత్రమేనని, ధావన్‌ స్థానంలో ఎంపిక చేయలేదని బీసీసీఐ ప్రకటించింది. గత ఏడాది కాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న పంత్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. అయితే కుర్ర పంత్‌కంటే అనుభవజ్ఞుడైన దినేశ్‌ కార్తీక్‌కే ప్రాధాన్యమిచ్చామని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చారు.  

మరో రెండు మ్యాచ్‌లకు...
ప్రస్తుతం ధావన్‌ గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అతని గాయంపై పూర్తిగా స్పష్టత వచ్చేందుకు మరో 10–12 రోజులు పడుతుందని బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ వెల్లడించారు. ముందుగా అనుకున్నట్లు కివీస్, పాక్‌ మ్యాచ్‌లకే కాకుండా 22, 27 తేదీల్లో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లతో జరిగే మ్యాచ్‌లు కూడా ధావన్‌ ఆడే అవకాశం కనిపించడం లేదు. అయితే 30లోగా అతను పూర్తిగా కోలుకోవచ్చని వైద్యులు టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు సమాచారం. వరల్డ్‌ కప్‌లో అతి పెద్ద మ్యాచ్‌గా భావిస్తున్న భారత్, ఇంగ్లండ్‌ మధ్య పోరు ఈ నెల 30న బర్మింగ్‌హామ్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో శిఖర్‌ బరిలోకి దిగితే చాలని భారత్‌ కోరుకుంటోంది.   

మరిన్ని వార్తలు