వన్డే జట్టులోకి రిషభ్‌ పంత్‌ 

12 Oct, 2018 01:18 IST|Sakshi

షమీ పునరాగమనం

విండీస్‌తో తొలి 2 మ్యాచ్‌లకు భారత జట్టు ప్రకటన  

సాక్షి, హైదరాబాద్‌: టెస్టు క్రికెట్‌లో అదరగొడుతున్న 21 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు భారత వన్డే జట్టులోనూ చోటు లభించింది. వెస్టిండీస్‌తో జరిగే తొలి రెండు వన్డేల కోసం 14 మంది సభ్యుల జట్టును గురువారం సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఓవల్‌ టెస్టులో దూకుడైన సెంచరీతో పాటు రాజ్‌కోట్‌ టెస్టులో 92 పరుగులు చేసిన పంత్‌ ఆటకు తగిన గుర్తింపు లభించింది. ధోని జట్టులో ఉండటంతో పంత్‌ను కేవలం స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గానే ఎంపిక చేశారు. పంత్‌ ఇప్పటికే భారత్‌ తరఫున 4 టి20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. వన్డేల్లో అతడికి చోటు కల్పించేందుకు దినేశ్‌ కార్తీక్‌పై వేటు వేశారు. ఆసియా కప్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్‌ కేవలం 146 పరుగులే చేశాడు. మిడిలార్డర్‌లో అతడి నుంచి ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో సెలక్టర్లు పక్కన పెట్టారు. మరోవైపు టెస్టుల్లో రెగ్యులర్‌ అయిన పేసర్‌ మొహమ్మద్‌ షమీ ఏడాది తర్వాత వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. ఆసియా కప్‌కు దూరంగా ఉన్న విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా మళ్లీ బరిలోకి దిగుతుండగా... టెస్టుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్న ప్రధాన పేసర్లు భువనేశ్వర్, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు మరింత విరామం అవసరమని సెలక్టర్లు భావించారు. కేదార్‌ జాదవ్, హార్దిక్‌ పాండ్యా గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు.   ఆసియా కప్‌ ఆడిన జట్టు సభ్యులలో పేస్‌ బౌలర్లు దీపక్‌ చహర్, సిద్ధార్థ్‌ కౌల్‌ తమ స్థానాలు కోల్పోగా... మరో ఇద్దరు పేసర్లు శార్దుల్‌ ఠాకూర్, ఖలీల్‌ అహ్మద్‌ చోటు నిలబెట్టుకున్నారు. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ 21న గువహటిలో, రెండో మ్యాచ్‌ 24న విశాఖపట్నంలో జరుగుతుంది.  

భారత వన్డే జట్టు
కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ధావన్, అంబటి రాయుడు, లోకేశ్‌ రాహుల్, మనీశ్‌ పాండే, ధోని, రిషభ్‌ పంత్, జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్, షమీ, శార్దూల్‌ ఠాకూర్, ఖలీల్‌ అహ్మద్‌.   

ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టు 18 వన్డేలు మాత్రమే ఆడనుంది. కాబట్టి అందుబాటులో ఉన్న అన్ని వనరులను పరీక్షించాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే పేస్‌ బౌలింగ్‌ విభాగంలో షమీకి మరోసారి అవకాశం కల్పించాం. మిడిలార్డర్‌ విషయంలో కూడా చాలా వరకు స్పష్టత వచ్చేసింది. పంత్‌ను బ్యాట్స్‌మన్‌గానే ఎంపిక చేశాం. భారత జట్టు నంబర్‌వన్‌ వికెట్‌ కీపర్‌ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోహ్లి గైర్హాజరులో రోహిత్, రహానే జట్లను సమర్థంగా నడిపించారంటే మనకో ప్రత్యామ్నాయం ఉందనే అర్థం తప్ప వారిని కెప్టెన్‌ చేయాలని కాదు. ఇక ఆటగాళ్లకు సమాచారం అందించే విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నామని మరో సారి చెబుతున్నా. ఎంపిక విషయంలో సెలక్టర్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అందరం ఒకే మాట మీద ఉన్నాం.   
  – ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్‌ సెలక్టర్‌   

మరిన్ని వార్తలు