అది మాత్రం నాకు చాలా ప్రత్యేకం : పంత్‌

23 Apr, 2019 16:47 IST|Sakshi

‘మ్యాచ్‌ ఫినిష్‌ చేసి బయటికొస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరు నాపై ఎంతో ప్రేమ కురిపించారు. అయితే సౌరవ్‌ సార్‌ నన్ను ఎత్తుకోవడం మాత్రం మరిచిపోలేను. అది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. నిజంగా అదొక వింతైన అనుభవం’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు రిషభ్‌ పంత్‌ ఆనందం వ్యక్తం చేశాడు.  ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ (36 బంతుల్లో 78 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్‌ హిట్టింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చిన పంత్‌.. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కించుకున్నాడు. అంతేగాక ఈ మ్యాచ్‌ తర్వాత పాయింట్ల పట్టికలో తొలిసారిగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రథమ స్థానంలో నిలవడంతో జట్టు యాజమాన్యంతో పాటు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పంత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా మ్యాచ్‌ అనంతరం సహ ఆటగాడు పృథ్వీ షాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... జట్టుకు అవసరమైన ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో.. అది కూడా క్లిష్ట పరిస్థితిల్లో జట్టును గెలిపించినపుడు కలిగే ఆనందాన్ని దేనితోనూ కొలవలేం అని పంత్‌ వ్యాఖ్యానించాడు. అదే విధంగా సౌరవ్‌ సార్‌ చూపిన ప్రేమకు తాను ఫిదా అయ్యానంటూ చెపుకొచ్చాడు. ‘  నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మిడిల్‌ ఓవర్లలో నీతో కలిసి ఆడుతున్నపుడు. మనం మ్యాచ్‌ ఫినిష్‌ చేస్తామని తెలుసు. చేశాం కూడా’ అని పంత్‌ పేర్కొన్నాడు. ఇక జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో లైఫ్‌ పొందడం గురించి పంత్‌.. షాను ప్రశ్నించగా.. ‘ ఇలాంటి అనుభవం నాకు ఇదే తొలిసారి. అసలు నేనిది నమ్మలేకపోయాను. బాల్‌ నా బ్యాట్‌ను తాకిందనే అనుకున్నాను. బెయిల్స్‌ వెలిగాయని నువ్వే అనుకుంటా నాకు చెప్పింది’ అంటూ బదులిచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో షాకు బౌలింగ్‌ చేసే క్రమంలో జోఫ్రా ఆర్చర్‌ ఫుల్‌టాస్‌ వేయగా అది స్టంప్స్‌ను తాకింది గానీ బెయిల్స్‌ మాత్రం కిందపడలేదు.

మరిన్ని వార్తలు