ఆ వదంతులు నమ్మవద్దు: రిషభ్‌ పంత్‌

14 May, 2018 12:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పటిష్టమైన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లోనే అద్భుత శతకం చేసిన యువ సంచలనం, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు రిషభ్‌ పంత్‌ త్వరలోనే భారత జాతీయ జట్టుకు ఆడతాడని మాజీ కెప్టెన​ సౌరవ్‌ గంగూలీ ఇటీవల అభిప్రాయపడ్డాడు. అయితే ఈ నేపథ్యంలో తనను టీమిండియాకు ఎంపిక చేయలేదంటూ పంత్‌ వ్యాఖ్యానించినట్లు కథనాలు ప్రచారమయ్యాయి. దీంతో తనపై వచ్చిన వదంతులపై ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ పంత్‌ స్పందించాడు.

‘టీమిండియాకు ఎంపిక చేయలేదని నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ నన్ను ఇటీవల ప్రకటించిన భారత జట్టుకు ఎంపిక చేయలేదని వ్యాఖ్యానించినట్లు ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదని వివరణ ఇచ్చుకుంటున్నాను. నేను కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఇలాంటి వదంతులను వ్యాప్తి చేయవద్దని కోరుతూ’ ట్వీట్‌ చేశాడు పంత్‌. ఈ ఐపీఎల్‌లో అత్యధిక (582) పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా పంత్‌ ఉన్నాడు.

ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే, టీ20లకు, ఐర్లాండ్‌తో టీ20లకు భారత జట్టును సెలక్షన్‌ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత రహానే లాంటి ఆటగాడిని పక్కన పెట్టడంతో ‘దాదా’ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్‌ ఆటతీరుతో పాటు నిలకడ ప్రదర్శిస్తే పంత్, ఇషాన్‌ కిషన్‌ వంటి యువ కెరటాలు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంతో దూరంలో లేరన్నాడు.

మరిన్ని వార్తలు