‘మా వరల్డ్‌కప్‌ ప్రణాళికల్లో రిషభ్‌ ఉన్నాడు’

14 Jan, 2019 11:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ నుంచి యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ను తప్పించడంపై టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ క్లారిటీ ఇచ్చాడు. కేవలం రిషభ్‌కు విశ్రాంతి మాత్రమే ఇ‍చ్చామని, జట్టు నుంచి ఉద్వాసన పలకలేదన్నాడు. అతనొక ఎదుగుతున్న క్రికెట్‌ విజేత అంటూ ప్రశంసలు కురిపించిన ఎంఎస్‌కే ప్రసాద్‌.. తమ వరల్డ్‌కప్‌ ప్రణాళికల్లో రిషభ్‌ కూడా ఉన్నాడని స్సష్టం చేశాడు.

‘ఆస్ట్రేలియాలో రిషభ్‌ పంత్‌ నాలుగు టెస్టులు, మూడు టీ20లు ఆడాడు. ఎడతెరపి లేని ఆట అతడి శరీరంపై తీవ్ర ప్రభావం చూపింది. అతడికి కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరం. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ లయన్స్‌పై ఎన్ని మ్యాచ్‌లు ఆడగలడో చూస్తాం. పంత్‌ మా ప్రపంచకప్‌ ప్రణాళికల్లో ఉన్నాడు. అతడో విజేతగా రూపొందుతున్నాడు. అతడి శక్తియుక్తులేంటో అతడికింకా పూర్తిగా తెలియదు. అవసరానికి తగినట్టు ఆడగలనని నిరూపించాడు. టెస్టులకు ఎంపిక చేసినప్పుడు అతడి కీపింగ్‌ ప్రతిభ గురించి అందరూ పెదవి విరిచారు. ఇంగ్లండ్‌లో ఒక టెస్టులో 11 క్యాచ్‌ అందుకున్నప్పుడు, ఆస్ట్రేలియాలో రికార్డులు బద్దలు చేసినప్పుడు మా అంచనా నిజమైంది’ అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.

జనవరి 23వ తేదీ నుంచి భారత్‌-ఎ-ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్ల మధ్య అనధికారిక ఐదు వన్డేల సిరీస్‌తో పాటు రెండు టెస్టుల సిరీస్‌ జరుగనుంది. భారత్‌-ఎ తరఫున వన్డే సిరీస్‌లో రిషభ్‌ ఆడనున్నాడు.

మరిన్ని వార్తలు