-

టీమిండియాలో ప్రక్షాళన జరగాల్సిందే : మాజీ క్రికెటర్‌

27 Jul, 2019 18:11 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి పర్యవేక్షణలో కోహ్లిసేన పలు ఐసీసీ టోర్నీలు ఓడిందని, తదుపరి ప్రపంకప్‌కు సిద్ధమయ్యేందుకు ఇదే సరైన సమయమని తెలిపాడు. ప్రధాన కోచ్‌ మార్పు కూడా అనివార్యమని చెప్పాడు. బీసీసీఐ ఆహ్వానం మేరకు ఈ పదవికి దరఖాస్తు చేసుకున్న రాబిన్‌ సింగ్‌.. జట్టును నడిపించే సత్తా తనకుందని, తన అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు.

‘ప్రస్తుత కోచ్‌ పర్యవేక్షణలో భారత్‌ రెండు వరుస ప్రపంచకప్‌ల్లో సెమీస్‌లోనే నిష్క్రమించింది. టీ20 ప్రపంచకప్‌ల్లో కూడా సానుకూల ఫలితం రాలేదు. ఇప్పుడు 2023 ప్రపంచకప్‌కు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జట్టులో మార్పులు కూడా అవసరమే. క్షిష్ట పరిస్థితుల్లో కోచ్‌ పాత్ర కీలకం. పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఆటగాళ్లతో వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాల్సి ఉంటుంది. అది ఆటను సాంకేతికంగా అర్థం చేసుకున్నప్పుడే సాధ్యమవుతోంది.’ అని రాబిన్‌ సింగ్‌ చెప్పుకొచ్చాడు.

ఇక ప్రపంచకప్‌-2019లో భారత్‌-న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్‌లో తాను కోచ్‌గా ఉంటే ఏం చేసేవాడినో కూడా వివరించాడు. ‘ బంతి స్వింగ్‌ అవ్వడంతో రోహిత్‌ శర్మ త్వరగా ఔటయ్యాడు. ఆ సమయంలో కోహ్లిని పంపించకుండా మరో టాపర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ను ఆడించేవాడిని. నెం.4గా కోహ్లిని పంపించి నెం.5లో ధోనిని ఆడించేవాడిని. అప్పుడు కోహ్లి-ధోని మంచి భాగస్వామ్యం నెలకొల్పేవారు. చివర్లో హార్ధిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజాలు పవర్‌ హిట్టింగ్‌తో మిగతా పనిని పూర్తి చేసేవారు’ అని తన వ్యూహాన్ని రాబిన్‌ సింగ్‌ వెల్లడించాడు. 

భారత్‌ తరఫున 136 వన్డేలు, ఒక్క టెస్ట్‌కు ప్రాతినిథ్యం వహించిన రాబిన్‌ సింగ్‌కు కోచ్‌గా 15 ఏళ్ల అనుభవం ఉంది. 2007-09 మధ్య భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా కూడా పని చేసాడు. భారత అండర్‌-19, ఏ జట్లకు సైతం కోచ్‌గా సేవలందించాడు. ఐపీఎల్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు సహాయ కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం భారత హెడ్‌ కోచ్‌ పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే కోచ్‌ ఎంపిక కోసం బీసీసీఐ నియమించిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) మాత్రం ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఏసీలో సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రవిశాస్త్రి బాగా పని చేశాడని అన్షుమన్ గైక్వాడ్ కితాబు ఇవ్వడంతో అతనికే మరోసారి కోచ్‌ పగ్గాలు అప్పచెబుతారానే ప్రచారం జోరందుకుంది. ఇక భారత ప్రధాన కోచ్‌ రేసులో రాబిన్‌సింగ్‌తో పాటు టామ్‌ మూడీ, మహేళ జయవర్ధనే, మైక్‌ హస్సెన్‌ తదితరులున్నట్లు తెలుస్తోంది.

(చదవండి: రవిశాస్త్రి వైపే మొగ్గు?)

మరిన్ని వార్తలు