రవిశాస్త్రిపై సంచలన వ్యాఖ్యలు!

28 Jul, 2019 12:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒకవైపు రవిశాస్త్రి పర్యవేక్షణలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించిందని క్రికెట్‌ సలహా కమిటీ((సీఏసీ) సభ్యుల్లో ఒకరైన అన్షుమన్‌ గైక్వాడ్‌ పేర్కొంటే, అసలు కోచ్‌గా రవిశాస్త్రి ఏం సాధించాడని భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌ ప్రశ్నించాడు. రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో భారత్‌ ఏ ఒక్క ఐసీసీ మేజర్‌ టోర్నమెంట్లను గెలవలేదంటూ సంచలన ఆరోపణలు చేశాడు.దాంతో కోచ్‌ మార్పు అనేది టీమిండియాకు ఎంతో అవసరమనే విషయాన్ని రాబిన్‌ సింగ్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. (ఇక్కడ చదవండి: కోచ్‌గా రవిశాస్త్రి వైపే మొగ్గు?)

‘ రవిశాస్త్రి కోచ్‌గా చాలాకాలం నుంచి కొనసాగుతున్నాడు. కానీ ఐసీసీ నిర్వహించే ఏ ఒక్క టోర్నమెంట్‌ను కూడా రవిశాస్త్రి పర్యవేక్షణలోని టీమిండియా గెలవలేదు. ఇందుకు వరుసగా రెండు వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు టీ20 వరల్డ్‌కప్‌ ఉదాహరణ. 2015, 2019 వరల్డ్‌కప్‌ల్లో భారత్‌ సెమీస్‌తోనే సరిపెట్టుకుంది. ఇక 2016లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో కూడా భారత్‌ సెమీస్‌ అడ్డంకిని అధిగమించలేదు. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ఇప్పట్నుంచే సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. దాంతో కోచ్‌ మార్పు అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంది. అది భారత క్రికెట్‌కు మంచిది’ అని రాబిన్‌ సింగ్‌ పేర్కొన్నాడు.

ప్రస్తుతం ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసిన రాబిన్‌ సింగ్‌.. 2007-09 సీజన్‌లో భారత్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌గా పని చేశాడు. మరొకవైపు అండర్‌-19, భారత్‌-ఏ జట్లకు సైతం ఫీల్డింగ్‌ కోచ్‌గా చేసిన అనుభవం రాబిన్‌కు ఉంది. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించాడు. కొన్ని రోజుల క్రితం టీమిండియా ప్రధాన కోచ్‌తో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌లకు సంబంధించి బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.  ఈ బాధ్యతలను కపిల్‌ దేవ్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సీఏసీ కమిటీకి అప్పచెప్పింది.

మరిన్ని వార్తలు