'ఆ నిర్ణయం నా కెరీర్‌ను ముంచేసింది'

20 May, 2020 13:14 IST|Sakshi

ముంబై : టెస్ట్ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో 25 ఏళ్ల వయసులో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవాలనే తప్పుడు నిర్ణయం తన కెరీర్‌ను ముంచేసిందని భారత సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ఈ తప్పిదం వల్లే తన బ్యాటింగ్‌లో దూకుడు తగ్గిందని, దాంతో కెరీర్‌ గ్రాఫ్‌ పడిపోయిందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఊతప్ప తాజాగా ఆ జట్టు సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఊతప్ప తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
('థ్యాంక్యూ.. సారా అండ్‌ అర్జున్‌')

'భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే నా అతిపెద్ద లక్ష్యం. దానికి తగ్గట్టు 20-21 ఏళ్ల వయసులోనే ప్రయత్నాలు మొదలు పెడితే బాగుండేది. కానీ 25 ఏళ్ల వయసులో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవడం నాకు కీడు తలపెట్టింది. అప్పటివరకు స్థిరంగా ఆడుతూ వస్తున్న నా బ్యాటింగ్‌లో మునపటి పదును తగ్గింది. అయితే కెరీర్‌లో ఏ విషయం గురించి పశ్చాత్తాప పడవద్దనుకున్నా.. అత్యత్తుమ ప్రదర్శన కనబర్చాలనుకున్నా. అందుకే ఆ సమయంలో ప్రవీణ్ అమ్రే పర్యవేక్షణలో నా బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవాలని నిర్ణయించుకొని మరింత మెరుగైన బ్యాట్స్‌మన్‌గా తయారవ్వాలనుకున్నా. ముఖ్యంగా గంటలకొద్దీ క్రీజులో ఉండి.. స్థిరంగా రాణించాలనుకున్నా. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది.'అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.


2006లో భార‌త జ‌ట్టులోకి అరంగేట్రం చేసిన ఊత‌ప్ప‌.. జట్టులో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోలేక‌పోయాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడైన త‌ను త‌ర్వాత కనుమరుగయ్యాడు. 13 ఏళ్ల కెరీర్‌లో ఊత‌ప్ప 46 వ‌న్డేలు, 13 టీ20లు ఆడాడు. చివ‌రిసారిగా 2015లో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఆడాడు. కాగా రాబిన్‌ ఊతప్ప అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరపున తొలి హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
(హ్యాపీ బర్త్‌డే జూ. ఎన్టీఆర్‌: వార్నర్‌)
('కష్టపడి సంపాదించాలి.. డిమాండ్‌ చేయొద్దు')

మరిన్ని వార్తలు