ఐపీఎల్‌.. ప్రపంచకప్‌కు మంచి ప్రాక్టీస్‌

19 Mar, 2019 20:18 IST|Sakshi

కోల్‌కతా : ప్రపంచకప్‌ దృష్ట్యా ఐపీఎల్‌లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బౌలర్లు గాయపడే అవకాశం ఉండటంతో ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఆడకపోవటమే మంచిదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. ఈ మేరకు బీసీసీఐకి మాజీ ఆటగాళ్లు విజ్ఞప్తి చేశారు. అయితే ఫ్రాంచైజీల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన బోర్డు.. ఆటగాళ్లపై అధిక శ్రమ లేకుండా చేయమని కోరింది. అయినప్పటికీ ఐపీఎల్‌లో ఆటగాళ్లు పాల్గొనడంపై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే తాజాగా కోల్‌కత్‌ నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఊతప్ప ఈ వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 
ఏ ఆటగాడికైనా దేశం తరుపున ఆడటం కన్న అత్యుత్తమైన గౌరవం మరొకటి ఉండదని ఊతప్ప పేర్కొన్నాడు. అయితే ప్రపంచకప్‌ దృష్ట్యా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకుండా ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ఈ మెగా టోర్నీతో క్రికెటర్లకు మంచి ప్రాక్టీస్‌ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. గాయాలవుతాయనే భయంతో ఈ మెగా టోర్నీకి దూరంగా ఉండవలసిన అవసరంలేదని.. బౌలర్లు నాలుగు ఓవర్లు వేసినంత మాత్రాన గాయాలు కావన్నాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నంత కాలం గాయాల సమస్య ఉండదని ఊతప్ప వివరించాడు.  ఇక ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌లో కేకేఆర్‌ సారథి దినేశ్‌ కార్తీక్, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌లు ఉన్న నేపథ్యంలో ఊతప్ప వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
(‘ఆటలోనే కాదు.. ఆలోచనలోనూ తోపే’) 

>
మరిన్ని వార్తలు