‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’ 

5 Jun, 2020 00:04 IST|Sakshi

బెంగళూరు: మానసిక ఆందోళనతో తాను తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నానని భారత క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప అన్నాడు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినట్లు అతను చెప్పాడు. ఉతప్ప టీమిండియా తరఫున 46 వన్డేలు, 13 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2008లో జట్టులో చోటు కోల్పోయిన సమయంలో తీవ్ర ఒత్తిడి కారణంగా పలు రకాల ఆలోచనలతో తాను సతమతమయ్యేవాడినని ఉతప్ప గుర్తు చేసుకున్నాడు. ‘2009–2011 మధ్య కాలంలో నేను దాదాపు ప్రతీ రోజూ తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాను. భారత జట్టులో స్థానం లభించకపోవడం కూడా ఒక కారణం కావచ్చు కానీ క్రికెట్‌ మాత్రమే కాకుండా ఇతరత్రా కూడా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. ముఖ్యంగా క్రికెట్‌ జరగని రోజుల్లో నా పరిస్థితి దారుణంగా ఉండేది. అసలు ఈ రోజు గడుస్తుందా, రేపటి వరకు ఉండగలనా అనిపించేది. అలా పరుగెత్తుకుంటూ వెళ్లి బాల్కనీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే భావన కూడా వచ్చింది. కానీ ఏదోలా అది ఆగిపోయింది.’ అని ఉతప్ప తన అనుభవాన్ని వెల్లడించాడు. 

మరిన్ని వార్తలు