ఫెడరర్‌ ఫటాఫట్‌

23 Jan, 2020 02:52 IST|Sakshi

రెండో రౌండ్‌లో అలవోకగా నెగ్గిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం

వరుసగా 21వ ఏడాది మూడో రౌండ్‌ చేరిన మాజీ చాంపియన్‌

జొకోవిచ్‌ కూడా ముందుకు

ఎదురులేని ఒసాకా, సెరెనా

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ

వయసు పెరిగినా తనలో వన్నె తగ్గలేదని నిరూపిస్తూ స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. ప్రత్యర్థి ప్రపంచ 41వ ర్యాంకర్‌ అయినప్పటికీ... ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన 38 ఏళ్ల ఫెడరర్‌ కేవలం ఆరు గేమ్‌లు కోల్పోయి విజయం దక్కించుకున్నాడు. 2000లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడిన ఫెడరర్‌ వరుసగా 21వ ఏడాది కనీసం మూడో రౌండ్‌కు చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఎలాంటి సన్నాహక టోర్నీ ఆడకుండానే నేరుగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన ఫెడరర్‌ ఈ మెగా ఈవెంట్‌లో గతంలో ఆరుసార్లు చాంపియన్‌గా, ఒకసారి రన్నరప్‌గా నిలిచాడు.

మెల్‌బోర్న్‌: రికార్డుస్థాయిలో ఏడోసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో మూడో సీడ్‌ ఫెడరర్‌ 6–1, 6–4, 6–1తో ప్రపంచ 41వ ర్యాంకర్‌ ఫిలిప్‌ క్రాజినోవిచ్‌ (సెర్బియా)పై గెలిచాడు. 92 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ కేవలం ఆరు గేమ్‌లు మాత్రమే కోల్పోయాడు. 14 ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయలేదు. నెట్‌ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు సాధించాడు. 42 విన్నర్స్‌ కొట్టిన ఫెడరర్‌ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేసి తన సర్వీస్ ను ఒకసారి చేజార్చుకున్నాడు. వరుసగా 21వ ఏడాది ఈ టోర్నీలో ఆడుతోన్న ఫెడరర్‌కు ఓవరాల్‌గా ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో 99వ విజయమిది.

శుక్రవారం జరిగే మూడో రౌండ్‌లో జాన్‌ మిల్‌మన్‌ (ఆ్రస్టేలియా)తో ఫెడరర్‌ ఆడతాడు.ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫెడరర్‌ మూడో రౌండ్‌లో మూడుసార్లు మాత్రమే ఓడిపోయాడు. 2000, 2001లలో అర్నాడ్‌ క్లెమెంట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో... 2015లో ఆండ్రియాస్‌ సెప్పి (ఇటలీ) చేతిలో ఫెడరర్‌ పరాజయం చవిచూశాడు. ఫెడరర్‌తోపాటు డిఫెండింగ్‌ చాంపియన్, రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) కూడా మూడో రౌండ్‌కు చేరాడు. రెండో రౌండ్‌లో జొకోవిచ్‌ 6–1, 6–4, 6–2తో తత్సుమా ఇటో (జపాన్‌)పై నెగ్గగా... ఆరో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)కు తన ప్రత్యర్థి కోల్‌ష్రైబర్‌ (జర్మనీ) నుంచి వాకోవర్‌ లభించింది.

ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో 100వ ర్యాంకర్‌ టెనిస్‌ సాండ్‌గ్రెన్‌ (అమెరికా) 7–6 (9/7), 6–4, 4–6, 2–6, 7–5తో ఎనిమిదో సీడ్‌ బెరెటిని (ఇటలీ)పై... ప్రపంచ 80వ ర్యాంకర్‌ టామీ పాల్‌ (అమెరికా) 6–4, 7–6 (8/6), 3–6, 6–7 (3/7), 7–6 (10/3)తో 18వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై, మారిన్‌ సిలిచ్‌ (క్రొయేíÙయా) 6–2, 6–7 (6/8), 3–6, 6–1, 7–6 (10/3)తో 21వ పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై సంచలన విజయం సాధించారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో చివరి సెట్‌లో స్కోరు 6–6 వద్ద సమమైనపుడు ‘సూపర్‌ టైబ్రేక్‌’ ద్వారా విజేతను నిర్ణయిస్తున్నారు. తొమ్మిదో సీడ్‌ అగుట్‌ (స్పెయిన్‌), 12వ సీడ్‌ ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) కూడా మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. అగుట్‌ 5–7, 6–2, 6–4, 6–1తో మైకేల్‌ మోమా (అమెరికా)పై, ఫాగ్‌నిని 7–6 (7/4), 6–1, 3–6, 4–6, 7–6 (10/4)తో థాంప్సన్‌ (ఆ్రస్టేలియా)పై నెగ్గారు.  

బార్టీ సునాయాసంగా...
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నయోమి ఒసాకా (జపాన్‌), మాజీ విజేత సెరెనా విలియమ్స్‌ (అమెరికా), టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా) సునాయాస విజయాలతో మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. మూడో సీడ్‌ ఒసాకా 6–2, 6–4తో సాయ్‌సాయ్‌ జెంగ్‌ (చైనా)పై, సెరెనా 6–2, 6–3తో తమారా జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)పై, బార్టీ 6–1, 6–4తో పొలోనా హెర్‌కాగ్‌ (స్లొవేనియా)పై గెలిచారు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7–5, 7–5తో పౌలా బదోసా (స్పెయిన్‌)పై, పదో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 7–6 (7/3), 6–2తో అరంటా రస్‌ (నెదర్లాండ్స్‌)పై, మాజీ చాంపియన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) 7–5, 7–5తో యాస్‌ట్రెమ్‌స్కా (ఉక్రెయిన్‌)పై, 15 ఏళ్ల అమెరికా టీనేజర్‌ కోరి గౌఫ్‌ 4–6, 6–3, 7–5తో సిర్‌స్టీ (రొమేనియా)పై విజయం సాధించారు. 11వ సీడ్‌ సాబలెంకా (బెలారస్‌) 6–7 (6/8), 6–7 (6/8)తో కార్లా స్యురెజ్‌ నవారో (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయింది.

రెండో రౌండ్‌లో దివిజ్‌ జంట...
పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రోహన్‌ బోపన్న (భారత్‌)–యాసుటకా ఉచియామ (జపాన్‌) జోడీ 1–6, 6–3, 3–6తో 13వ సీడ్‌ మైక్‌ బ్రయాన్‌–బాబ్‌ బ్రయాన్‌ (అమెరికా) జంట చేతిలో ఓడిపోగా... దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–అర్తెమ్‌ సితాక్‌ (న్యూజి లాండ్‌) ద్వయం 6–4, 7–5తో కరెనో బుస్టా (స్పెయిన్‌)–జావో సుసా (పోర్చుగల్‌) జంటపై గెలిచింది.  

మిక్స్‌డ్‌ డబుల్స్‌కు సానియా దూరం....
కాలి పిక్కలో నొప్పి కారణంగా భారత మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం నుంచి వైదొలిగింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉంది. సానియా వైదొలగడంతో ఆమె మహిళల డబుల్స్‌ భాగస్వామి నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆడనున్నాడు. మహిళల డబుల్స్‌లో మాత్రం నేడు జరిగే తొలి రౌండ్‌లో సానియా–నదియా జంట జిన్‌యున్‌ హాన్‌–లిన్‌ జు (చైనా) జోడీతో ఆడనుంది.   

>
మరిన్ని వార్తలు