ఫెడరర్‌ సంపాదన రూ. 803 కోట్లు

30 May, 2020 00:10 IST|Sakshi

అత్యధిక ఆర్జనగల క్రీడాకారుడిగా స్విస్‌ టెన్నిస్‌ స్టార్‌ ఘనత

రూ. 196 కోట్లతో 66వ స్థానంలో విరాట్‌ కోహ్లి

వాషింగ్టన్‌: ఏడాది కాలంలో అత్యధిక ఆర్జనగల క్రీడాకారుల జాబితాలో స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ తొలిసారి టాప్‌ ర్యాంక్‌లో వచ్చాడు. ‘ఫోర్బ్స్‌’ పత్రిక విడుదల చేసిన టాప్‌–100 క్రీడాకారుల జాబితాలో ఫెడరర్‌ ఐదో స్థానం నుంచి అగ్రస్థానానికి ఎగబాకాడు. 2019 జూన్‌ నుంచి 2020 జూన్‌ కాలానికి ఫెడరర్‌ మొత్తం 10 కోట్ల 63 లక్షల డాలర్లు (రూ. 803 కోట్లు) సంపాదించాడు. ఇందులో 10 కోట్ల డాలర్లు ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చాయి. మిగతా 63 లక్షల డాలర్లు టోర్నీలు ఆడటం ద్వారా గెల్చుకున్న ప్రైజ్‌మనీ.

గతేడాది ‘టాప్‌’లో నిలిచిన పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో 10 కోట్ల 50 లక్షల డాలర్ల ఆర్జనతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ (10 కోట్ల 40 లక్షల డాలర్లు) మూడో ర్యాంక్‌లో నిలిచాడు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఏకంగా 34 స్థానాలు ఎగబాకాడు. గతేడాది 100వ ర్యాంక్‌లో నిలిచిన కోహ్లి ఈసారి 2 కోట్ల 60 లక్షల డాలర్ల (రూ. 196 కోట్లు) ఆర్జనతో 66వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కోహ్లికి ఎండార్స్‌మెంట్ల ద్వారా 2 కోట్ల 40 లక్షల డాలర్లు లభించగా... 20 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీ, వేతనం ద్వారా వచ్చాయి. టాప్‌–100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్‌ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లినే కావడం విశేషం.

మరిన్ని వార్తలు