ఫెదరర్కు ఊహించని షాక్

19 Jun, 2016 17:47 IST|Sakshi
ఫెదరర్కు ఊహించని షాక్

హాలీ:  ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్కు ఊహించని షాక్ తగిలింది. హాలీ  ఓపెన్ టోర్నమెంట్లో  ఫేవరెట్గా బరిలోకి దిగిన ఫెదరర్.. 19 ఏళ్ల జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ చేతిలో భంగపడ్డాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో అలెగ్జాండర్ 7-6(7/4), 5-7, 6-3 తేడాతో ఫెదరర్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లాడు.   తొలి సెట్ నుంచి ఫెదరర్కు చెమటలు పట్టించిన అలెగ్జాండర్ అంచనాలు మించి రాణించాడు.  టై బ్రేక్ దారి తీసిన తొలి సెట్లో నాలుగు పాయింట్లు మాత్రమే కోల్పోయిన అలెంగ్జాడర్ ఆ సెట్ను దక్కించుకున్నాడు.

 

అనంతరం రెండో సెట్లో తిరిగి పుంజుకున్న ఫెదరర్ ఆ సెట్ను కైవసం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో ఆది నుంచి అలెగ్జాండర్ ఆధిక్యం కనబరిచాడు. అనవసర తప్పిదాలకు ఎక్కువ ఆస్కారం ఇవ్వకుండా ఫెదరర్ ను వెనక్కునెట్టాడు. దీంతో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ కు ముందు ఓ గ్రాస్ కోర్టు టోర్నమెంట్లో విజేతగా నిలవాలనుకున్న ఫెదరర్ ఆశలకు గండిపడింది. ఒక యువ టెన్నిస్ క్రీడాకారుడి చేతిలో ఫెదరర్ ఓడిపోవడం దాదాపు పదేళ్ల తరువాత ఇదే ప్రథమం. అంతకుముందు 2006లో సిన్సినాటి మాస్టర్స్ టోర్నీలో బ్రిటన్ ఆటగాడు ఆండ్రీ ముర్రే  చేతిలో ఫెదరర్ పరాజయం చెందాడు. మరోవైపు అలెంగ్జాడర్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ టూర్ ఫైనల్ కావడం విశేషం. గత నెల్లో నైస్ ఓపెన్ టోర్నీలో డోమినిక్ థెమ్ను ఓడించి అలెగ్జాండర్ ఫైనల్ చేరాడు.
 

మరిన్ని వార్తలు