తాజా తాజా రోజర్‌

30 Jan, 2018 00:50 IST|Sakshi
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌తో రోజర్‌ ఫెడరర్‌

‘గ్రాండ్‌’ విజయంతో కొత్త సీజన్‌ మొదలు

ఆస్వాదిస్తున్నంత కాలం ఆటలోనే 

ఆట కంటే దృక్పథం ముఖ్యం...  సహచరులంతా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఎండను నిందిస్తుంటే అతడు మాత్రం అందుకుతగ్గట్లు మనమే సిద్ధమవ్వాలన్నాడు.  ఫామ్‌ తాత్కాలికం... క్లాస్‌ శాశ్వతం.  మధ్యలో ఎందరో వచ్చారు. పోటాపోటీగానూ ఆడారు. కానీ, అంతే త్వరగా తెరమరుగయ్యారు. అవుతున్నారు. ఈ విజేత మాత్రం అలసిపోవడం లేదు. వ్యక్తి ఎదుగుదలకు  కుటుంబం అండ ముఖ్యం అవును! అతడికి వెన్నంటి నిలిచే భార్య, నిత్యం ప్రోత్సహించే అమ్మానాన్న, కనుల పంటలాంటి కవలల జంట పిల్లలతో చక్కటి అనుబంధాల ఇల్లుంది.  వయసు అనేది ఓ అంకె మాత్రమే  అనుకుంటే అది మనపై ప్రభావం చూపదు ఈ స్విస్‌ యోధుడు సరిగ్గా ఇలానే భావిస్తాడు. చేయదగిన దానిపైనే దృష్టిపెడతాడు.  విజయ గర్వంతో పొంగిపోకూడదు...  ఓటమితో కుంగిపోకూడు...  పదుల గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినా పసిపిల్లాడి తరహాలో ఒకే హావభావం. ఓటమినీ అంతే హుందాగా స్వీకరించిన గొప్ప దనం.


సాక్షి క్రీడావిభాగం : ...తాజాగా మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకుని తన పయనం అలుపెరగనిదని చాటుతోన్న రోజర్‌ ఫెడరర్‌ గురించి ఎంత చెప్పినా అది కొంతే అనిపిస్తుంది. సంప్రదాయ–ఆధునిక టెన్నిస్‌కు వారథిలాంటి ఈ సౌమ్యుడు 36 ఏళ్ల వయసులోనూ, పడిపడి లేచే కెరటంలా కనిపిస్తున్నాడు. విమర్శలు, వివాదాలు, దూకుడు కలగలసిన క్రీడలో జెంటిల్‌మన్‌ వ్యక్తిత్వంతో సమున్నతంగా నిలుస్తున్నాడీ ఆల్‌టైమ్‌ గ్రేట్‌. దాదాపు రెండు దశాబ్దాల అతడి ప్రస్థానం చూస్తే... 1 నుంచి 10 వరకు అన్నీ తానే అనే స్థితి నుంచి, ఒక దశలో అసలెక్కడున్నాడో తెలియని పరిస్థితినీ ఎదుర్కొన్నాడు. అయినా సంయమనం, స్థైర్యం కోల్పోలేదు. ఆటనే నమ్ముకున్నాడు. ఎప్పటికి ఏది  సాధ్యమో దానినే అనుసరించాడు. దాని ఫలితమే తాజా ఘన పునరాగమనం. ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ టైటిల్స్‌ను నెగ్గుకురావడం ఎలాగనేది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రోజర్‌ను గమనించిన వారందరికీ ఓ పాఠమే. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో అయిదింటిని రెండు గంటల్లోపే ముగించిన అతడు టోర్నీలో కేవలం రెండే సెట్లు, అదీ ఫైనల్లో మాత్రమే ఓడిపోయాడు. 

అది మర్చిపోయా...కానీ మళ్లీ వస్తా! 
అస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజయంతో ఫెడరర్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ‘గెలిస్తే ఎలా స్వీకరించాలి? ఓడితే ఎలా ఉండాలి? అని మ్యాచ్‌కు ముందే తీవ్రంగా ఆలోచించే రోజర్‌  ఈ సందర్భంగా తన ఊతపదమైన ‘మళ్లీ వస్తా’ అని చెప్పడం మర్చిపోయాడు. దీంతో రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడేమో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ‘పునరాగమనాన్ని ఇష్టపడతా. ఆ సంగతి చెప్పడం మాత్రమే మర్చిపోయా. వచ్చే సంవత్సరం రాగలనని ఆశతో ఉన్నా’ అని ప్రకటించి వాటికి తెరదించాడు. ‘ఏడాదిలో మూడు గ్రాండ్‌స్లామ్స్‌ గెలిచానంటే నమ్మలేకున్నా. షెడ్యూల్‌ను చక్కగా ప్లాన్‌ చేసుకున్నా. ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఒక ప్రొఫెషనల్‌గా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నా’ అని అంటున్నాడంటే రెండు, మూడేళ్లయినా కొనసాగుతాడని తెలుస్తోంది. 

ఆటపై అనురాగం... 
2005–07 ఫెడరర్‌ రాజ్యమేలిన రోజులవి. ఆ కాలంలో 10 గ్రాండ్‌స్లామ్‌లలో 8 గెలిచాడు. నాదల్, జొకోవిచ్, ముర్రేల వంటి అథ్లెటిక్‌ నైపుణ్యం ఉన్నవారికి తోడు మధ్యలో వావ్రింకా మెరవడంతో తర్వాత రెండేళ్ల నుంచి అతడి ప్రభ తగ్గడం మొదలైంది. దీంతో నాలుగేళ్ల పాటు టైటిల్‌ అనేదే గెలవలేకపోయాడు. 2016లో ఆరు నెలలపాటు పోటీ ప్రపంచ టెన్నిస్‌కు దూరంగా ఉన్నాడు. తన పనైపోయిందని, వయసు మీదపడిందని విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇంకెవరైనా అయితే ఇంతటితో ఆటపై ఆశలు వదులుకునేవారు. కానీ ఇక్కడ ఉన్నది ఫెడరర్‌. అందుకే గోడకు కొట్టిన బంతిలా వెనక్కువచ్చాడు. గతేడాది ఏకంగా నాదల్‌ను ఓడించి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలుచుకున్నాడు. బహుశా ఇందుకే తాను పునరాగమనాన్ని ఇష్టపడతానని చెబుతుంటాడేమో. ప్రస్తుతం రోజర్‌ అద్భుతమైన ఆటతీరుతో ఉన్నాడని... నాలుగేళ్ల టైటిళ్ల లోటును తీర్చుకుంటున్నాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

పరిపూర్ణ మనిషి... 
సమకాలీన ఆటగాళ్లలో ఎవరికీ లేని చక్కటి కుటుంబం ఫెడరర్‌ సొంతం. అతడి ఘనతలకు ఈ నేపథ్యమూ ఓ కారణమే. తల్లిదండ్రులు, భార్య, నలుగురు పిల్లల తన కుటుంబానికి రోజర్‌ ఇచ్చే ప్రాధాన్యం అతడిని సంపూర్ణ వ్యక్తిగా చూపుతోంది. భార్య మిర్కానే మేనేజర్‌ కావడం ప్రణాళికల పరంగా ఈ స్విస్‌ స్టార్‌కు చాలా మేలు చేస్తోంది.  

అతడిని అందుకోలేరేమో! 
సమీప ప్రత్యర్థులైన నాదల్‌ (16 గ్రాండ్‌స్లామ్స్‌ టైటిల్స్‌) తరచూ గాయాలతో సతమతం అవుతున్నాడు. మునుపటి పదునులేదు. జొకోవిచ్‌ (12 గ్రాండ్‌స్లామ్స్‌) ఆటతీరుతో పాటు వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నాడు. ముర్రే స్థాయిని ఇంతకుమించి ఊహించలేం. పైగా వీరంతా 30 ఏళ్లు దాటినవారే. ఇక వావ్రింకా నిలకడైన ఆటగాడేమీ కాదు. ఈ లెక్కన ఫెడరర్‌ 20 టైటిళ్ల రికార్డును అందుకోవడం అసాధ్యంగానే కనిపిస్తోంది. దీనిని బలంగా చాటేందుకేనేమో... ఫైనల్‌ అనంతరం మీడియా సమావేశానికి వచ్చిన ఫెడరర్‌ ధరించిన టీ షర్ట్‌పై ‘20’ అంకె స్పష్టంగా కనిపించింది. 

మరిన్ని వార్తలు