ఫెడరర్‌ @ 98

18 Jun, 2018 06:43 IST|Sakshi

 మెర్సిడెస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన స్విస్‌ స్టార్‌

స్టుట్‌గార్ట్‌ (జర్మనీ): మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ టైటిల్‌ సాధించాడు. ఆదివారం ముగిసిన మెర్సిడెస్‌ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. 78 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఫెడరర్‌ 6–4, 7–6 (7/3)తో ఆరో సీడ్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)పై గెలుపొందాడు. ఫెడరర్‌ కెరీర్‌లో ఇది 98వ సింగిల్స్‌ టైటిల్‌కాగా... గ్రాస్‌ కోర్టులపై 28వది.

చాంపియన్‌ ఫెడరర్‌కు 1,17,030 యూరోల (రూ. 92 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు, మెర్సిడెస్‌ కారు లభించింది. ఈ టోర్నీలో ఫైనల్‌ చేరడంద్వారా సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో 36 ఏళ్ల ఫెడరర్‌ మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సొంతం చేసుకోనున్నాడు. ‘ఇది ఘనమైన పునరాగమనం. మూడో ప్రయత్నంలో నేను ఈ టైటిల్‌ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మరోసారి టాప్‌ ర్యాంక్‌ నాలో కొత్త ఉత్సాహం నింపుతుందో లేదో వేచి చూడాలి’ అని ఫెడరర్‌ అన్నాడు.  

కెరీర్‌ మొత్తంలో 148 ఫైనల్స్‌ ఆడిన ఫెడరర్‌ 98 ఫైనల్స్‌లో విజేతగా నిలిచి, 50 ఫైనల్స్‌లో ఓడిపోయాడు. అతను సాధించిన 98 టైటిల్స్‌లో 65 టైటిల్స్‌ విజయాలు వరుస సెట్‌లలో వచ్చాయి.1998లో ప్రొఫెషనల్‌గా మారిన ఫెడరర్‌ అత్యధిక సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జిమ్మీ కానర్స్‌ (అమెరికా–109 టైటిల్స్‌) అగ్రస్థానంలో ఉన్నాడు.  

ఏడాదివారీగా ఫెడరర్‌ టైటిల్స్‌ సంఖ్య: 2001 (1); 2002 (3); 2003 (7); 2004 (11); 2005 (11); 2006 (12); 2007 (8); 2008 (4); 2009 (4); 2010 (5); 2011 (4); 2012 (6); 2013 (1); 2014 (6); 2015 (6); 2016 (0); 2017 (7); 2018 (3).

మరిన్ని వార్తలు