జ్వెరేవ్‌ చేతిలో ఫెడరర్‌ చిత్తు 

18 Nov, 2018 01:56 IST|Sakshi

లండన్‌:  ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ పోరు ముగిసింది. ఆరు సార్లు ఏటీపీ టూర్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఫెడెక్స్‌పై సంచలన విజయంతో జర్మనీ కుర్రాడు అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీస్‌లో జ్వెరేవ్‌ 7–5, 7–6 (5)తో ఫెడరర్‌ను ఓడించాడు. ఫలితంగా 1996 (బోరిస్‌ బెకర్‌) తర్వాత ఏటీపీ ఫైనల్స్‌ చేరిన తొలి జర్మనీ ఆటగాడిగా జ్వెరేవ్‌ నిలిచాడు. 1 గంటా 35 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. ఫెడరర్‌కంటే 16 ఏళ్లు చిన్నవాడైన 21 ఏళ్ల జ్వెరేవ్‌ ప్రత్యర్థితో హోరాహోరీగా తలపడ్డాడు.
 

తొలి సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు పది గేమ్‌ల వరకు సమంగా సాగింది. 5–5 వద్ద 11వ గేమ్‌ను నిలబెట్టుకొని 6–5 ఆధిక్యంలోకి వెళ్లిన జ్వెరేవ్‌ తర్వాతి గేమ్‌లో రోజర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 40 నిమిషాల్లో సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌ మరింత పోటాపోటీగా సాగింది. స్విస్‌ స్టార్‌ ముందుగా 2–1తో ముందంజ వేసినా చక్కటి బేస్‌లైన్‌ ఆటతో జ్వెరేవ్‌ దానిని సమం చేశాడు. 4–5తో వెనుకబడిన రోజర్‌ మళ్లీ పోరాడాడు. అయితే జోరు తగ్గించని జ్వెరేవ్‌ 6–5తో దూసుకుపోయాడు. ఆ తర్వాత బ్యాక్‌హ్యాండ్‌ వాలీ విన్నర్‌తో అతను ఫెడరర్‌ ఆట కట్టించాడు.    
 

మరిన్ని వార్తలు