100వ టైటిల్‌ వేటలో...

11 Jan, 2019 01:51 IST|Sakshi

99వ ర్యాంకర్‌తో ఫెడరర్‌ తొలి పోరు 

సెరెనాకు బలమైన పోటీ

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ‘డ్రా’ విడుదల

మెల్‌బోర్న్‌: కెరీర్‌లో 100వ ఏటీపీ టైటిల్‌ సొంతం చేసుకునే లక్ష్యంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలోకి దిగుతున్న టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కు సులువైన ‘డ్రా’ ఎదురైంది. 2019లో తొలి గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ గురువారం విడుదలైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) తొలి రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డెనిస్‌ ఇస్టోమిన్‌తో తలపడతాడు. 2017, 2018 సహా ఫెడెక్స్‌ ఇప్పటివరకు ఆరుసార్లు ఈ టైటిల్‌ నెగ్గాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 99వ స్థానంలో ఉన్న ఇస్టోమిన్‌కు 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో నొవాక్‌ జొకోవిచ్‌కు ఓడించిన రికార్డు ఉంది. అంచనాల ప్రకారమే అన్ని మ్యాచ్‌లు సాగితే ఫెడరర్, రాఫెల్‌ నాదల్‌ మధ్య సెమీ ఫైనల్‌ పోరు జరుగుతుంది. గత ఏడాది ఫెడరర్‌ చేతిలో ఫైనల్లో ఓడిన మారిన్‌ సిలిచ్‌తో పాటు బెర్నార్డ్‌ టామిక్, ఆండీ ముర్రే కూడా ఒకే పార్శ్వంలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)కు టాప్‌ సీడింగ్‌ లభించింది.

అయితే జొకోవిచ్‌ ‘డ్రా’ మాత్రం కాస్త కఠినంగా ఉంది. రెండో రౌండ్‌లోనే అతను విల్‌ఫ్రెడ్‌ సోంగా (ఫ్రాన్స్‌)ను ఎదుర్కోవాల్సి రావచ్చు. జపాన్‌ స్టార్, ఇటీవలి బ్రిస్బేన్‌ ఓపెన్‌ గెలిచి ఊపు మీదున్న కి నిషికోరి కూడా అతని పార్శ్వంలోనే ఉండటం నంబర్‌వన్‌కు కఠిన పరీక్షగా మారనుంది. 2018లో అద్భుతంగా ఆడి వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌లు గెలుచుకోవడంతో పాటు నంబర్‌వన్‌గా నిలిచిన జొకోవిచ్‌ ఖాతాలో కూడా ఆరు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లు ఉన్నాయి. కెరీర్‌లో ఒకే ఒక్క ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)కు ప్రిక్వార్టర్‌ వరకు ఇబ్బంది లేకపోయినా క్వార్టర్స్‌లో వింబుల్డన్‌ రన్నరప్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) ఎదురయ్యే ప్రమాదం ఉంది. తొలి రౌండ్‌లో నాదల్‌...ఆస్ట్రేలియా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ జేమ్స్‌ డక్‌వర్త్‌ను ఎదుర్కొంటాడు. సొంతగడ్డపై ఆడనున్న అన్‌సీడెడ్‌ నిక్‌ కిర్గియోస్, 16వ సీడ్‌ మిలోస్‌ రావోనిక్‌ (కెనడా) మధ్య జరిగే ఆసక్తికర మ్యాచ్‌తో సోమవారం నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు తెర లేవనుంది.  

అలీసన్‌ వాన్‌తో వోజ్నియాకీ పోరు...
మహిళల విభాగంలో ఎనిమిదో సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ ఆశిస్తున్న అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ విజయమార్గం అంత సులువుగా లేదు. ఈ టోర్నీలో ఆమె 16వ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. తొలి రౌండ్‌లో తత్‌జానా మారియా (జర్మనీ)ను ఎదుర్కోనున్న సెరెనా ప్రిక్వార్టర్స్‌లోనే వరల్డ్‌ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)తో తలపడే అవకాశం ఉంది. అంతకు ముందు రెండో రౌండ్‌ ప్రత్యర్థి బౌచర్డ్‌ (కెనడా)నుంచి కూడా సెరెనాకు ఇబ్బంది తప్పకపోవచ్చు. డిఫెండింగ్‌ చాంపియన్‌ కరోలినా వోజ్నియాకీ (డెన్మార్క్‌) తన మొదటి పోరులో అలీసన్‌ వాన్‌ (బెల్జియం)ను ఎదుర్కొంటుంది. మూడో రౌండ్‌లో మారియా షరపోవా (రష్యా)ను ఆమె ఎదుర్కోవాల్సి రావచ్చు. 

మరిన్ని వార్తలు