బోపన్న సాధించాడు..

8 Jun, 2017 18:05 IST|Sakshi
బోపన్న సాధించాడు..

పారిస్: భారత టెన్నిస్ సంచలనం రోహన్ బోపన్న తన కెరీర్ లో నూతన అధ్యాయాన్ని లిఖించాడు. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను సాధించడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో భాగంగా మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. గురువారం జరిగిన తుది పోరులో రోహన్ బోపన్న- దబౌస్కీ జోడి 2-6, 6-2, 12-10 తేడాతో అనాలెనా గ్రోన్‌ఫెల్డ్‌ (జర్మనీ)–రాబర్ట్‌ ఫరా (కొలంబియా)పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

హోరాహోరీగా జరిగిన పోరులో అత్యంత ఆత్మవిశ్వాసం కనబరిచిన బోపన్న-దబౌస్కీ జోడి కడవరకూ పోరాడి టైటిల్ ను సాధించారు. తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ, ఆ తరువాత రెండు సెట్లలో ఈ జోడి చెలరేగి ఆడింది. ప్రధానంగా చివరి సెట్ మాత్రం నువ్వా-నేనా అన్న రీతిలో ఉత్కంఠభరింతగా సాగింది. అయితే ఒత్తిడిన అధిగమించిన బోపన్న జోడి చివరకు విజేతగా నిలిచింది. తాజా టైటిల్ తో భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్ల జాబితాలో బోపన్న చేరిపోయాడు. అంతకుముందు భారత తరపున లియాండర్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలకు మాత్రమే గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సాధించగా, ఆ తరువాత స్థానంలో బోపన్న నిలిచాడు. 2010లో తొలిసారి యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో ఫైనల్ కు చేరిన బోపన్న.. అప్పుడు గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించడంలో విఫలమయ్యాడు.

మరిన్ని వార్తలు