‘చెక్’ పెడతాం: బోపన్న

16 Sep, 2015 01:49 IST|Sakshi
‘చెక్’ పెడతాం: బోపన్న

న్యూఢిల్లీ : డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌ను ఓడించి వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధిస్తామని భారత డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘చెక్ జట్టులో వందలోపు ర్యాంక్ ఆట గాళ్లు ఇద్దరున్నా ఇబ్బంది లేదు. గతంలో చాలాసార్లు మేటి ఆటగాళ్లను ఓడించాం. ఏ ఆటగాడు ఒత్తిడిని జయిస్తాడనే దానిపైనే విజయాలు ఆధారపడి ఉంటాయి. వరల్డ్ గ్రూప్‌కు వెళ్లడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. దాన్ని ఉపయోగించుకుంటాం’ అని బోపన్న వెల్లడించాడు.

మరోవైపు లియాండర్ పేస్ కోసం హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేనిని డేవిస్ కప్ జట్టు నుంచి పక్కకు పెట్టడం సరైంది కాదని భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ అభిప్రాయపడ్డారు. పేస్ లేని సమయంలో సాకేత్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని గుర్తు చేశారు. ‘పేస్ ఆడాలనుకుంటే అవకాశం ఇవ్వండి. కానీ సాకేత్‌ను పక్కనబెట్టడం సరైంది కాదు. కుర్రాడికి ఆటలో అనుభవం లేకపోవచ్చుగానీ పేస్-బోపన్న మాదిరిగా ప్రత్యర్థులను చూసి భయపడే వ్యక్తిత్వం మాత్రం కాదు’ అని అమృత్‌రాజ్ వివరించారు.

మరిన్ని వార్తలు