బోపన్న జంటకు నిరాశ 

22 Apr, 2018 01:22 IST|Sakshi

మోంటెకార్లో: కెరీర్‌లో పదోసారి మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకోవాలని ఆశించిన భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ రోహన్‌ బోపన్నకు నిరాశ ఎదురైంది. మోంటెకార్లో మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో బోపన్న–వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జోడీకి సెమీఫైనల్లో ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో బోపన్న–వాసెలిన్‌ ద్వయం 6–7 (4/7), 6–4, 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఒలివర్‌ మరాచ్‌ (ఆస్ట్రియా)–ప్యాట్‌ మావిచ్‌ (క్రొయేషియా) జంట చేతిలో పరాజయం పాలైంది. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. గతేడాది పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే)తో కలిసి ఈ టోర్నీ టైటిల్‌ నెగ్గిన బోపన్న ఈసారి మాత్రం సెమీస్‌లోనే నిష్క్రమించడం గమనార్హం. నిర్ణాయక సూపర్‌ టైబ్రేక్‌లో బోపన్న–వాసెలిన్‌ 7–5తో ఆధిక్యంలో ఉన్నా వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నారు. సెమీస్‌లో ఓడిన బోపన్న జంటకు 71,130 యూరోలు (రూ. 57 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

నాదల్‌ 12వసారి... 
మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 12వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో నాదల్‌ 6–4, 6–1తో దిమిత్రోవ్‌ (బల్గేరియా)ను ఓడించాడు. నేడు జరిగే ఫైనల్లో నిషికోరి (జపాన్‌)తో నాదల్‌ ఆడతాడు.    

మరిన్ని వార్తలు