గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశా

29 Jul, 2013 06:54 IST|Sakshi
గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశా

న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ లియాండర్ పేస్, మహేశ్ భూపతి నీడలో వెనకుండిపోయిన భారత అగ్రశ్రేణి డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న ప్రస్తుతం వీరిద్దరినీ వెనక్కి నెట్టాడు. నిలకడైన ప్రదర్శనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకిన ఈ బెంగళూరు ప్లేయర్ భవిష్యత్‌లో టాప్ ర్యాంక్‌నూ అందుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.
 
 నంబర్‌వన్ స్థానంతోపాటు గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడమే తన తదుపరి లక్ష్యమని స్పష్టం చేశాడు. ఏటీపీ టూర్ టైటిల్స్ సాధించినప్పటికీ ‘గ్రాండ్‌స్లామ్’ ట్రోఫీ  వెలతిగా ఉందని త్వరలో దాన్ని సాధిస్తానన్నాడు. 2003లో ప్రొఫెషనల్ ఆటగాడిగా మారినప్పటికీ తను సాధించిన 8 టైటిళ్లలో ఆరింటిని ఈ మూడేళ్లలోనే గెలుచుకున్నాడు. ఖురేషీ (పాకిస్థాన్)తో కలిసి ఆడటం ద్వారా వెలుగులోకి వచ్చిన 33 ఏళ్ల ఈ భారత ఆటగాడు... గతేడాది సీనియర్ స్టార్ మహేశ్ భూపతితోనూ విజయవంతమయ్యాడు.
 
  సన్నిహితులు ‘బోఫోర్స్’గా పిలుచుకునే బోపన్న ఇన్నేళ్ల కెరీర్‌పై సంతృప్తి వ్యక్తం చేశాడు. 2010లో యూఎస్ ఓపెన్‌లో టైటిల్ పోరులో పోరాడినప్పటికీ బోపన్న-ఖురేషి జోడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తరచూ డబుల్స్ భాగస్వామిని మార్చే ఇతను ప్రస్తుతం గ్రాండ్‌స్లామ్ టైటిలే లక్ష్యంగా చెమటోడ్చుతున్నట్లు చెప్పాడు. ఈ సీజన్‌లోనే ఎనిమిది మందిని అతను మార్చాడు. రోజర్ వాసెలిన్‌తో కలిసి వింబుల్డన్‌లో రాణించిన బోపన్న తాజాగా జర్మనీకి చెందిన ఆండ్రూ బెగెమన్‌తో జతకట్టాడు. దీనిపై అతను వివరణ ఇస్తూ చక్కని ప్రదర్శన, సత్ఫలితాల కోసమే ఈ మార్పులని అన్నాడు.
 

మరిన్ని వార్తలు