200 స్టార్‌ @200

31 Jan, 2019 00:52 IST|Sakshi

సాక్షి క్రీడావిభాగం: వన్డే క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు డబుల్‌ సెంచరీలు బాదిన భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కెరీర్‌లో మరో డబుల్‌ సెంచరీ కొట్టేందుకు చేరువయ్యాడు. ఈ ద్విశతకాల వీరుడు నేడు కెరీర్‌లో 200వ వన్డే మ్యాచ్‌ ఆడబోతున్నాడు. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడు రోహిత్‌. వన్డేల్లో అత్యధిక స్కోరు (264) సహా అనేక ఘనతలు తన ఖాతాలో వేసుకున్న 32 ఏళ్ల ఈ ముంబైకర్‌ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగంగా నిలిచాడు. కోహ్లి (4,248 పరుగులు), శిఖర్‌ ధావన్‌ (4,334 పరుగులు)లతో రోహిత్‌ నమోదు చేసిన రికార్డు భాగస్వామ్యాలు టీమిండియాకు మరచిపోలేని మధుర జ్ఞాపకాలను అందించాయి. దిగ్గజాలు కూడా సాధించలేని రీతిలో వన్డేల్లో రోహిత్‌ కళ్లు చెదిరే గణాంకాలు నమోదు చేశాడు. కోహ్లి అద్భుత ప్రదర్శనతో కొన్ని సార్లు రోహిత్‌ ఆట మరుగున పడినట్లు కనిపించినా... 2013 నుంచి 2018 వరకు వరుసగా ఆరేళ్ల పాటు రోహిత్‌ ప్రతీ సంవత్సరం అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడంటే అతిశయోక్తి కాదు.  

ఆరేళ్లు అంతంతే... 
2007లో తొలి వన్డే ఆడిన నాటి నుంచి 2012 వరకు... 2013 నుంచి ఇప్పటి వరకు... రోహిత్‌ కెరీర్‌ను ఈ రెండు భాగాలుగా విశ్లేషించవచ్చు. తొలి ఆరేళ్ల పాటు ‘ప్రతిభావంతుడు’గా గుర్తింపు ఉన్నా దానికి న్యాయం చేయలేకపోయిన ఆటగాడిగానే రోహిత్‌ కనిపించాడు. ఆస్ట్రేలియాలో 2008 సీబీ సిరీస్‌లో రెండు కీలక అర్ధ సెంచరీలు సహా అప్పుడప్పుడు కొన్ని మెరుపులు ఉన్నా అవి రోహిత్‌ కెరీర్‌కు కావాల్సిన ఊపును ఇవ్వలేకపోయాయి. 2011లో దక్షిణాఫ్రికా గడ్డపై ఓపెనర్‌గా ప్రయత్నిస్తే చచ్చీ చెడి 23, 1, 5 పరుగులు చేశాడు. దాంతో వరల్డ్‌ కప్‌లో చోటు కూడా గల్లంతయింది. కొద్ది రోజులకే వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాణించిన తర్వాత కూడా తడబాటు కొనసాగింది. 2012 వరకు కేవలం 2 సెంచరీలు చేస్తే అవి జింబాబ్వే, శ్రీలంకపైనే వచ్చాయి. అదే ఏడాది చివర్లో అతని ఆఖరి ఆరు ఇన్నింగ్స్‌ల స్కోర్లు 5, 0, 0, 4, 4, 4 మాత్రమే! ఈ స్థితిలో అతని కెరీరే ముగిసిపోయే పరిస్థితి కనిపించింది. 

చాంపియన్స్‌ ట్రోఫీతో షురూ... 
2013 జనవరిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ధోని మరోసారి రోహిత్‌ను ఓపెనర్‌గా పంపే సాహసం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 83 పరుగులు చేశాడు. అయితే అసలు మాస్టర్‌ స్ట్రోక్‌ మాత్రం అదే ఏడాది జూన్‌లో చాంపియన్స్‌ ట్రోఫీతో మొదలైంది. ఈ టోర్నీతో మొదలైన రెగ్యులర్‌ ఓపెనర్‌ ప్రస్థానం రోహిత్‌ను వన్డే క్రికెట్‌ హీరోను చేసింది. అదే ఏడాది ఆస్ట్రేలియాపై సాధించిన తొలి డబుల్‌ సెంచరీతో అతని కెరీర్‌ తారాజువ్వలా దూసుకుపోయింది. తొలి ఆరేళ్లతో పోలిస్తే ఓపెనర్‌గా వచ్చాక  పరుగులు, సగటు, సెంచరీలు, స్ట్రైక్‌రేట్‌... ఇలా ప్రతీదాంట్లో రోహిత్‌ శిఖర సమాన పురోగతి సాధించాడు. 2013నుంచి 2018 వరకు ఆరేళ్ల పాటు ప్రతీ సంవత్సరం అతని బ్యాటింగ్‌ సగటు 50 కంటే ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఇప్పటికే వన్డే క్రికెట్‌లో అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్న రోహిత్‌ మున్ముందు మరెన్నో ఘనతలు సాధిస్తాడని ఆశిద్దాం. 

మరిన్ని వార్తలు