అతడికింకా 22 ఏళ్లే.. కాస్త సమయం ఇవ్వండి

9 Nov, 2019 19:00 IST|Sakshi

నాగ్‌పూర్‌: ప్రస్తుతం భారత క్రికెట్‌లో చర్చ జరుగుతున్న ప్రధాన అంశం ‘రిషభ్‌ పంత్‌ జట్టులో అవసరమా?’. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టీ20ల్లో భారత యువ సంచలనం రిషభ్‌ పంత్‌ ఘోరంగా విఫలమవ్వడంతో అతడిని టార్గెట్‌ చేస్తూ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అటు కీపింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో అంచనాలు అందుకోలేకపోతున్న పంత్‌ జట్టులో అవసరమా అంటూ పంత్‌ హేటర్స్‌ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పంత్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మద్దతుగా నిలుచున్న విషయం తెలిసిందే. తాజాగా దాదాతో పాటు టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ పంత్‌కు అండగా నిలిచాడు. కొంతకాలం పంత్‌ గురించి పట్టించుకోవడం మానేయండి అంటూ రోహిత్‌ కోరాడు. 

‘ప్రస్తుతం ప్రతీ రోజు, ప్రతీ క్షణం పంత్‌ గురించే తీవ్ర చర్చ జరుగుతుందని మీ అందరికీ తెలుసు. అయితే ప్రతీ ఒక్కరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. కొంతకాలం మీ దృష్టి పంత్‌పై కాకుండా వేరేవాటిపై పెట్టాలని కోరుకుంటున్నా. కొంతకాలం పంత్‌ గురించి పట్టించుకోవడం మానేస్తే అతడు గొప్పగా ఆడటానికి సహాయం చేసినవారవుతారు. పంత్‌ ఒక ఫియర్‌ లెస్‌ క్రికెటర్‌. మేము(టీమ్‌ మేనేజ్‌మెంట్‌) అతడికి పూర్తి స్వేచ్చనివ్వాలని అనుకున్నాం. దీనిలో భాగంగా పంత్‌ మైదానంలో ఏం చేయాలనుకుంటున్నాడో దానిని అనుమతించాలని నేను భావించాను.

టీమ్‌మేనేజ్‌మెంట్‌ స్ట్రాటజీ ప్రకారమే అతడు ఆడుతున్నాడు. అయితే విఫలమవుతున్నాడు. పంత్‌పై ఫోకస్‌ ఎక్కువగా ఉంది. మైదానంలో అతడు వేసే ప్రతీ అడుగు గురించి చర్చిస్తున్నారు. ఫెయిల్‌ అయితేనే కాదు సక్సెస్‌ అయినప్పుడూ కూడా పంత్‌ ఆకాశానికి ఎత్తుతున్నారు. అయితే మీ అందరికీ ఒక్కటి చెప్పదల్చుకున్నాను. అతడి వయసు కేవలం 22 ఏళ్లే. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. అలా అని అతడిని వెనకేసుకరావడం లేదు. అతడిలో అపార ప్రతిభ ఉంది కాబట్టే మేము అతడికి పూర్తి స్వేచ్చనిచ్చాం. ఒక్కసారి సెటిల్‌ అయితే అతడు గొప్ప క్రికెటర్‌గా మారడం ఖాయం’అంటూ రోహిత్‌ పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు