తొలి ఓపెనర్‌గా ప్రపంచ రికార్డు

20 Oct, 2019 10:48 IST|Sakshi

రాంచీ: ఇటీవల టీమిండియా ఓపెనర్‌ పాత్రలో అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ రికార్డులు మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మూడు సెంచరీలను సాధించిన రోహిత్‌ శర్మ..  చివరి టెస్టులో భాగంగా ఆదివారం రెండో రోజు ఆటలో 150కి పైగా పరుగులు సాధించాడు. నిన్నటి ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ.. ఈరోజు ఆటలో 150కి పైగా పరుగులతో భారీ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా మరో రికార్డు రోహిత్‌ ఖాతాలో చేరింది. దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో రెండుసార్లు 150కిపైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు.

అదే సమయంలో ఓవరాల్‌గా ఈ ఫీట్‌ సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.  2012-13 సీజన్‌లో మైకేల్‌ క్లార్క్‌.. సఫారీలతో జరిగిన సిరీస్‌లో రెండుసార్లు 150కి పైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆ మార్కును రోహిత్‌ చేరాడు. కాకపోతే క్లార్క్‌ మిడిల్‌ ఆర్డర్‌లో ఈ ఘనత సాధించాడు. ఆ ఇక ఒక సిరీస్‌లో సఫారీలపై రెండు సందర్భాల్లో 150కి పరుగులు నమోదు చేసిన తొలి ఓవరాల్‌ ఇండియన్‌ క్రికెటర్‌గా రోహిత్‌ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ 176 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. దాంతో కొత్త రికార్డును రోహిత్‌ తన పేరిట లిఖించుకున్నాడు. శనివారం నాటి ఆటలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. మూడో టెస్టులో మూడో సిక్సర్‌ కొట్టిన తర్వాత ఈ సిరీస్‌లో 16వ సిక్సర్‌ను రోహిత్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌ ఆటగాడు హెట్‌మెయిర్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. 2018-19 సీజన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో హెట్‌మెయిర్‌ 15 సిక్సర్లు కొట్టాడు. దాన్ని రోహిత్‌ తాజా బద్ధలు కొట్టాడు.కాగా, భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. 2010-11 సీజన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో హర్భజన్‌ సింగ్‌ 14 సిక్సర్లు కొట్టాడు. ఇదే ఒక్క టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు. దాన్ని కూడా సవరించాడు రోహిత్‌.

మరిన్ని వార్తలు