‘రోహిత్.. నీ షాట్‌ సెలక్షన్‌ మార్చుకో’

21 Sep, 2019 13:20 IST|Sakshi

న్యూఢిల్లీ: టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా రాణించాలంటే అంత ఈజీ కాదని, అది రోహిత్‌ శర్మకు కష్టంతో కూడుకున్నదని ఇటీవల భారత మాజీ వికెట్‌ నయాన్‌ మోంగియా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒకవేళ రోహిత్‌ టెస్టులకు తగ్గట్టు తన ఆట తీరును మార్చుకుంటే అది అతని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. కాగా, భారత దిగ్గజ ఆటగాడు సునీల్‌  గావస్కర్‌ మాత్రం రోహిత్‌ శర్మకు టెస్టు ఫార్మాట్‌తో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నాడు. టెస్టు ఓపెనర్‌గా కూడా రోహిత్‌ సక్సెస్‌ కాగలడని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తన డిఫెన్స్‌ను మరింత కఠినతరం చేసుకోవాలని సూచించాడు.

‘టెస్టు క్రికెట్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఉన్న తేడా ఏమిటో మనకు తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బంతి స్వింగ్‌ కావడం తక్కువగా ఉంటుంది. కొన్ని ఓవర్లు మాత్రమే స్వింగ్‌ రాబట్టే అవకాశం ఉంటుంది. అయితే టెస్టు ఫార్మాట్‌లో ఉపయోగించే ఎర్ర బంతి చాలా ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. 35-40 ఓవర్ల తర్వాత బంతి నుంచి స్వింగ్‌ రాబట్ట వచ్చు. దాంతో రోహిత్‌ తన బ్యాటింగ్‌ శైలిని మార్చుకోవాలి. ఎక్కువ స్వింగ్‌కు ఇబ్బంది పడే రోహిత్‌ శర్మ టెక్నిక్‌లో ఎటువంటి ప్రాబ్లమ్‌ లేదు.

టెస్టు ఫార్మాట్‌లో తన షాట్‌ సెలక్షన్‌ కచ్చితంగా ఉంటే ఇక్కడ కూడా రోహిత్‌ పరుగుల వరద సృష్టించవచ్చు. రోహిత్‌ టెస్టుల్లో సైతం ఓపెనర్‌గా సక్సెస్‌ అవుతాడని అనుకుంటున్నా. అయితే తన డిఫెన్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌ ఎలా తన డిఫెన్స్‌ను టెస్టుల్లో ఉపయోగించాడో అదే తరహాలో రోహిత్‌ కూడా ఆడాలి. శరీరంపైకి వచ్చే బంతుల్ని సెహ్వాగ్‌ వదిలేసే వాడు. అది టెస్టు ఫార్మాట్‌లో కరెక్ట్‌. అదే రోహిత్‌ ఆన్‌సైడ్‌ బంతుల్ని హుక్‌ షాట్లగా కొడతాడు. ఇది కాస్త ప్రమాదకరం. ఇక్కడ తన షాట్‌ సెలక్షన్‌  రోహిత్‌ మార్చుకుంటే టెస్టుల్లో వంద శాతం సక్సెస్‌ అవుతాడు’ అని గావస్కర్‌ చెప్పుకొచ్చాడు.

>
మరిన్ని వార్తలు