రోహిత్‌ సెంచరీ వృథా

12 Jan, 2019 15:54 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి వన్డేలో టీమిండియా 34 పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఆసీస్‌ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొమ‍్మిది వికెట్ల నష్టానికి  254 పరుగులకే పరిమితమైన టీమిండియా ఓటమి చెందింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(133;129 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు)  సెంచరీ సాధించినప‍్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. జట్టు స్కోరును పెంచే క్రమంలో రోహిత్‌ ఏడో వికెట్‌గా ఔటయ్యాడు.  రోహిత్‌కు జతగా ఎంఎస్‌ ధోని(51; 96 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) మినహా ఎవరూ రాణించలేదు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.  ఖవాజా(59; 81 బంతుల్లో 6 ఫోర్లు), షాన్‌ మార్ష్‌(54; 70 బంతుల్లో 4 ఫోర్లు), హ్యాండ్ స్కాంబ్‌(73; 61 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు)లు హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో పాటు మార్కస్‌ స్టోనిస్‌(47 నాటౌట్‌; 43 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

అటు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ వరుస వికెట్లు కోల్పోయి ఆదిలోనే కష్టాల్లో పడింది. నాలుగు పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ధావన్‌ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దాంతో గోల్డెన్‌ డక్‌గా ఔటైన అపప్రథను మూటగట్టుకున్నాడు. ఆసీస్‌ పేసర్‌ బెహ్రాన్‌డార్ఫ్‌ వేసిన తొలి ఓవర్‌ ఆఖరి బంతిని ఆడటంలో తడబడిన ధావన్‌ వికెట్లు ముందు దొరికిపోయాడు. అటు తర్వాత విరాట్‌ కోహ్లి(3) సైతం నిరాశపరచడంతో టీమిండియా నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై వెంటనే అంబటి రాయుడు డక్‌ ఔట్‌ కావడంతో భారత్‌ కష్టాల్లో పడింది.  ఆ తరుణంలో  రోహిత్-ధోనిల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 137 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత ధోని నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై రోహిత్‌కు ఏ ఒక్క ఆటగాడి దగ్గర్నుంచీ సహకారం లభించలేదు. దినేశ్‌ కార్తీక్‌(12), రవీంద్ర జడేజా(8)లు నిరాశపరచడంతో భారత్‌కు ఓ‍టమి తప్పలేదు. చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌(29 నాటౌట్‌; 23 బంతుల్లో 4 ఫోర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆసీస్‌ బౌలర్లలో యువ పేసర్‌ రిచర్డ్‌సన్‌ నాలుగు వికెట్లు సాధించగా, బెహ్రాన్‌డార్ఫ్‌, మార్కస్‌ స్టోనిస్ తలో రెండు వికెట్లు తీశారు. పీటర్‌ సిడెల్‌కు వికెట్‌ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం జరుగనుంది.

మరిన్ని వార్తలు