కోహ్లికి చేరువలో రోహిత్‌

8 Jul, 2019 17:58 IST|Sakshi

దుబాయ్‌:  ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఐదు సెంచరీలతో మంచి జోష్‌ మీద ఉన్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ర్యాంకింగ్స్‌ పరంగానూ దూసుకొస్తున్నాడు. వరల్డ్‌కప్‌ లీగ్‌ దశ ముగిసే సరికి రోహిత్‌ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో పాయింట్ల పరంగా టాప్‌ ప్లేస్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి రోహిత్‌ మరింత చేరవయ్యాడు. తాజా ఐసీసీ చాట్‌ ప్రకారం కోహ్లి 891 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్‌ 885 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు.  ఫలితంగా తన వన్డే కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్‌ పాయిట్లను రోహిత్‌ నమోదు చేశాడు. (ఇక్కడ చదవండి: రోహిత్‌, వార్నర్‌ల్లో ఎవరు?)

వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మ ఐదు సెంచరీలు చేసి ఆ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన తరుణంలో తన రేటింగ్‌ పాయింట్లను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్‌ శర్మకు కోహ్లికి 51 పాయింట్ల వ్యత్యాసం ఉండగా, మెగా టోర్నీ లీగ్‌ దశ ముగిసే సరికి వీరిద్దరి మధ్య ఆరు పాయింట్ల తేడా మాత్రమే ఉండటం ఇక్కడ విశేషం. కాగా, వరల్డ్‌కప్‌లో ఐదు హాఫ్‌ సెంచరీల సాయంతో 442 పరుగులు సాధించిన కోహ్లి ఖాతాలో కేవలం ఒక పాయింట్‌ మాత్రమే నమోదైంది. ఇక వన్డే బౌలింగ్‌ విభాగంలో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తన రేటింగ్‌ పాయింట్లను మరింత పెంచుకుని టాప్‌లో నిలిచాడు.  వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ 17 వికెట్లు సాధించిన బుమ్రా తన పాయింట్ల ఆధిక్యాన్ని 21 నుంచి 56కు పెంచుకున్నాడు. బుమ్రా 814 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, ట్రెంట్‌ బౌల్ట్‌(న్యూజిలాండ్‌) 758 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.



 

మరిన్ని వార్తలు