బ్రాడ్‌మన్‌ సరసన రోహిత్‌!

3 Oct, 2019 10:17 IST|Sakshi

విశాఖ:  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో  టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌గా టెస్టుల్లో ఇన్నింగ్స్‌ ఆరంభించిన రోహిత్‌ శర్మ శతకంతో మెరిశాడు. విమర్శకుల నోటికి తాళం వేస్తూ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఇది రోహిత్‌కు నాల్గో సెంచరీ. అంతకుముందు మిగతా మూడు సెంచరీలు మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి నమోదు చేస్తే, ఈసారి ఓపెనర్‌గా తన మార్కు ఆటను చూపెట్టాడు. ఫలితంగా ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ నిలిచాడు.

మరొకవైపు ఓపెనర్‌గా వచ్చి మూడు ఫార్మాట్‌లలో (టి20, వన్డే, టెస్టు) సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్‌ రోహిత్‌ రికార్డు సృష్టించాడు.  ఈ క్రమంలోనే అరుదైన ఘనతను సైతం రోహిత్‌ సాధించాడు. సొంత  గడ్డపై అత్యధిక టెస్టు యావరేజ్‌ నమోదు చేసిన ఆటగాళ్లలో డాన్‌ బ్రాడ్‌మన్‌ సరసన చేరాడు. టెస్టుల్లో మొత్తం 80 ఇన్నింగ్స్‌లు ఆడిన బ్రాడ్‌మన్‌ 29 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీలతో  99.94 సగటు నమోదు చేశాడు. కాగా, బ్రాడ్‌మన్‌ తన సొంత గడ్డ ఆస్ట్రేలియాలో మాత్రం 50 ఇన్నింగ్స్‌ల్లో 98.22 సగటు సాధించాడు. ఇప్పుడు ఇదే సగటును స్వదేశంలో రోహిత్‌ నమోదు చేయడం విశేషం. కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడి సొంత గడ్డపై అత్యధిక యావరేజ్‌ నమోదు చేసిన ఆటగాళ్లలో బ్రాడ్‌మన్‌ సరసన రోహిత్‌ చేరాడు. సొంత గడ్డపై ఇప్పటివరకూ 15 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్‌ 98.22 టెస్టు సగటుతో 884 పరుగులు సాధించాడు. ఇందులో నాల్గో సెంచరీలతో పాటు ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు