ఇది రోహిత్‌కు మరో ‘డబుల్‌ సెంచరీ’

28 Sep, 2019 15:31 IST|Sakshi

విజయనగరం: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో  బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌  రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా దిగి తీవ్రంగా నిరాశ పరిచాడు. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ ఆడిన రెండో బంతికే డకౌట్‌ అయ్యాడు. టెస్టు ఫార్మాట్‌లో ఇప్పటివరకూ ఓపెనర్‌గా బరిలోకి దిగని రోహిత్‌ శర్మ.. ఎర్రబంతి క్రికెట్‌లో తన అదృష్టాన్ని ఓపెనర్‌గా పరీక్షించుకునే క‍్రమంలో ఆదిలోనే చుక్కెదురైంది.  మూడో రోజు ఆటలో భాగంగా బోర్డు ప్రెసిడెంట్స్‌ బ్యాటింగ్‌కు దిగగా ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌లు ఆరంభించారు.

ఫిలిండర్‌ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో రోహిత్‌ ఇన్నింగ్స్‌ సున్నా వద్దే ముగిసింది. రోహిత్‌ పేలవ ప్రదర్శనపై అప్పుడే సోషల్‌ మీడియలో సెటైర్ల వర్షం మొదలైంది. ‘ అసలు రోహిత్‌ టెస్టుల్లో డకౌట్‌గా అవ్వడం కంటే ఓపెనర్‌గా రావడమే ఫన్నీగా ఉంది’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘ అసలు సిరీస్‌ ఇంకా ఆరంభం కాకుండానే రోహిత్‌ శర్మ డకౌట్లు మొదలేట్టేశాడు’ అని మరొక అభిమాని ట్వీట్‌ చేశాడు.  ఇది రోహిత్‌కు మరో ‘డబుల్‌ సెంచరీ’ అని మరొకరు ఎద్దేవా చేశారు.  ‘ రోహిత్‌ డబుల్‌ సెంచరీ చేయడానికి ఇంకా రెండొందల పరుగులు తక్కువ అయ్యాయి’ అని మరొక నెటిజన్‌ పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు