రోహిత్‌ ‘డబుల్‌’ మోత

5 Oct, 2019 15:51 IST|Sakshi

విశాఖ: టెస్టుల్లో అసలు ఓపెనర్‌గా పనికిరాడన్న పలువురి విమర్శకులకు రోహిత్‌ శర్మ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో మొదటిసారి ఓపెనర్‌గా దిగిన రోహిత్‌ శర్మ డబుల్‌ మోత మోగించాడు. ఏకంగా వరుస రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు నమోదు చేసి తన బ్యాటింగ్‌ పంచ్‌ను చూపించాడు. శనివారం నాల్గో రోజు ఆటలో మయాంక్‌ అగర్వాల్‌(7) నిరాశపరిచినప్పటికీ రోహిత్‌ మాత్రం ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేశాడు. ఎక్కడ కూడా తడబడకుండా సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. ముందుగా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌ .. దాన్ని సెంచరీగా మలచుకున్నాడు. 133 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లలో శతకం పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ సాధించిన రోహిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అత్యంత పరిణితితో ఆడాడు.

రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక భారీ షాట్‌ ఆడగా అది బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ముత్తుసామి దాన్ని అందుకోవడంలో విఫలమయ్యాడు. బంతిని పట్టుకున్నప్పటికీ అతని షూ బౌండరీ లైన్‌కు తాకడంతో అది సిక్స్‌ అయ్యింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడన రోహిత్‌ సంయమనంతో ఆడాడు. కచ్చితంగా మరో సెంచరీ సాధించాలనే కసితో క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఇది రోహిత్‌కు ఐదో టెస్టు సెంచరీ. ఇక టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రంలోనే వరుస రెండు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సాధించాడు. మరొకవైపు ఓపెనర్‌గా తొలి టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్‌ తన పేరిట లిఖించుకున్నాడు. 1982-82 సీజన్‌లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ కెప్లెర్‌ వెసెల్స్‌ ఓపెనర్‌గా ఆడిన తొలి టెస్టులో 208 పరుగులు నమోదు చేశాడు. ఇక ఒక టెస్టులో కనీసం రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన ఆరో భారత ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. అంతకుముందు విజయ్‌ హజారే, సునీల్‌ గావస్కర్‌(మూడుసార్లు), రాహుల్‌ ద్రవిడ్‌( రెండుసార్లు), కోహ్లి(ఒకసారి), రహానే(ఒకసారి) ఈ మార్కును చేరారు.

దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్‌ ఫోటోలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు