కోహ్లి రికార్డుపై కన్నేసిన రోహిత్‌

2 Nov, 2019 15:46 IST|Sakshi

ఢిల్లీ: ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ.. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమయ్యాడు. ఈ మూడు టీ20ల సిరీస్‌ నుంచి రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. కాగా, ఇప్పుడు రోహిత్‌ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అగ్రస్థానంలో నిలవడానికి రోహిత్‌ 8 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లి(2,450) టాప్‌లో ఉండగా, రెండో స్థానంలో రోహిత్‌(2,443) ఉన్నాడు. రేపు జరగబోయే తొలి టీ20లోనే రోహిత్‌ ఈ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం ఉంది. కోహ్లి రికార్డును సవరించడానికి చాలా స్వల్ప దూరంలో ఉండటంతో రోహిత్‌కు అదేమి పెద్ద కష్టం కాకపోవచ్చు.

అదే సమయంలో అంతర్జాతీయ టీ20ల్లో 50కి పైగా పరుగులు సాధించిన జాబితాలో కూడా కోహ్లినే టాప్‌లో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లి 22 హాఫ్‌ సెంచరీలతో ముందంజలో ఉండగా, రోహిత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్‌ నాలుగు సెంచరీలు, 17 హాఫ్‌ సెంచరీలతో ఉన్నాడు. అంటే యాభైకి పైగా పరుగుల్ని 21 సందర్భాల్లో రోహిత్‌ సాధించాడు. ఒక హాఫ్‌ సెంచరీ సాధిస్తే కోహ్లి సరసన చేరతాడు రోహిత్‌. ఒకవేళ ఈ సిరీస్‌లో  రోహిత్‌ కనీసం రెండు హాఫ్‌ సెంచరీలు సాధిస్తే మరో కోహ్లి రికార్డు కూడా బద్ధలు అవడం ఖాయం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా