నాల్గో టెస్టుకు రోహిత్‌ దూరం

31 Dec, 2018 12:59 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా చివరిదైన నాల్గో టెస్టుకు టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌ శర్మ దూరం కానున్నాడు. అతని భార్య రితిక ఆదివారం ఆడబిడ్డకు జన్మనివ్వడంతో వారిని చూసేందుకు భారత్‌కు రానున్నాడు. ఈ మేరకు సోమవారం భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఓ ప‍్రకటనలో వెల్లడించింది.

‘ఆస్ట్రేలియా నుంచి భారత్‌కి రోహిత్ శర్మ త్వరలో వెళ్లనున్నాడు. అతని భార్య రితిక ఆదివారం ఓ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. దీంతో.. పాపని చూసేందుకు రోహిత్ శర్మ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అతని రాకతో భారత్ జట్టులో సమతూకం వచ్చింది. సిడ్నీ టెస్టులోనూ అతను ఆడితే బాగుంటుంది. కానీ.. తొలి బిడ్డకి జన్మనిచ్చిన ఈ సమయంలో రితిక పక్కన రోహిత్ ఉండటం చాలా ముఖ్యం’ అని బీసీసీఐ తెలిపింది. జనవరి 8వ తేదీన రోహిత్‌ శర్మ తిరిగి ఆస్ట్రేలియాకు వస్తాడని పేర్కొంది.

దాదాపు తొమ్మిది నెలలు తర్వాత భారత టెస్టు జట్టులోకి ఇటీవల పునరాగమనం చేసిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో (రెండు ఇన్నింగ్స్‌‌లు 37, 1) 38 పరుగులతో నిరాశపరిచాడు. ఆపై గాయం కారణంగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టుకి దూరమైన రోహిత్‌ శర్మ.. ఆదివారం మెల్‌బోర్న్‌లో ముగిసిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ (63 నాటౌట్‌) రాణించాడు. జనవరి మూడో తేదీ నుంచి సిడ్నీ వేదికగా నాల్గో టెస్టు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు