రోహిత్‌ ఫోకస్‌ పెట్టాడంటే అంతే..!

16 Nov, 2019 14:56 IST|Sakshi

ఇండోర్‌: ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ గెలిచిన  తర్వాత పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసలు కురిపించాడు. తొలి మ్యాచ్‌లో ఓడిపోయినా, రెండు, మూడు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్‌ గెలిచిందంటే ఆ జట్టు ఆటతీరే కారణమంటూ కొనియాడాడు. ఈ క్రమంలో మూడో టీ20 మ్యాచ్‌ను ఉదాహరిస్తూ టీమిండియా ‘బాస్‌ ఆఫ్‌ ద గేమ్‌’ అంటూ అభిప్రాయపడ్డాడు. అదే సందర్భంలో రెండో టీ20లో చెలరేగిన రోహిత్‌ శర్మపై ప్రత్యేకంగా పొగడ్తలతో ముంచెత్తాడు. ‘రోహిత్‌ శర్మ కచ్చితంగా ఆడాలనుకంటే అతను ఆడతాడు. ప్రపంచ క్రికెట్‌లో అతనొక అసాధారణ ఆటగాడు. ఈ మ్యాచ్‌లో ఆడాలని దృష్టి పెడితే రోహిత్‌ అందుకు తీవ్రంగా శ్రమిస్తాడు’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

ఇప్పుడు రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ సంగతిని పెట్టి ఫీల్డింగ్‌పై ఫోకస్‌ పెట్టాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భాగంగా శనివారం మూడో రోజు ఆటలో ముష్ఫికర్‌ రహీమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్‌ జారవిడిచాడు. షమీ బౌలింగ్‌లో బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతిని కాస్త కష్టపడితే పట్టే క్యాచ్‌ను రోహిత్‌ నేలపాలు చేశాడు. దాంతో ఫీల్డ్‌లోనే అసహనం వ్యక్తం చేసిన రోహిత్‌ తాను క్యాచ్‌ను ఎందుకు వదిలేశాననే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. లంచ్‌ విరామంలో అదే తరహా స్లిప్‌ క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేశాడు. ఇలు పలుమార్లు ప్రాక్టీస్‌ చేసిన రోహిత్‌ ఏ బంతికి ఎంతవరకూ రియాక్ట్‌ కావాలో అంచనా వేసుకున్నాడు.

లంచ్‌ తర్వాత షమీ వేసిన ఓవర్‌లో మహ్మదుల్లా ఇచ్చిన స్లిప్‌ క్యాచ్‌ను రోహిత్‌ ఏమాత్రం తడబాటు లేకుండా పట్టేసుకున్నాడు. ‘దటీజ్‌ రోహిత్‌.. మరి రోహిత్‌ ఫోకస్‌ పెట్టాడంటే అంతే’ అని అనుకోవడం అభిమానుల వంతైంది. మరి దీనికి సంబంధించి వీడియోనే బీసీసీఐ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. బంగ్లాదేశ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఏడో వికెట్‌గా మెహిది హసన్‌ ఔటయ్యాడు. ఇక నాలుగు పరుగుల వద్ద రోహిత్‌ రూపంలో లైఫ్‌ లభించిన రహీమ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు