రోహిత్‌పై భారీ అంచనాలు.. కానీ డకౌట్‌

28 Sep, 2019 12:09 IST|Sakshi

విజయనగరం: టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ సెట్‌ కాలేడు అనేది ఒకవైపు  వాదన అయితే, ఎర్రబంతి క్రికెట్‌లో కూడా ఓపెనర్‌ రోహిత్‌ సక్సెస్‌ అవుతాడనే చర్చ ఇటీవల కాలంలో ఎక్కువగా నడిచింది. ఇప్పటికే రోహిత్‌ శర్మకు టెస్టు క్రికెట్‌ ఆడిన అనుభవం బాగానే ఉన్నప్పటికీ ఈ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా ఇంత వరకూ బ్యాటింగ్‌కు చేయని పరిమిత ఓవర్ల హిట్‌ మ్యాన్‌ ఎంత వరకూ రాణిస్తాడనే ప్రశ్న విశ్లేషకులకు బాగానే పని చెప్పింది. దీనిలో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో  బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా పరీక్షించుకోవాలనుకున్నప్పటికీ  నిరాశే ఎదురైంది. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ ఆడిన రెండో బంతికే పెవిలియన్‌ చేరాడు. అసలు పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా వికెట్‌ సమర్పించుకున్నాడు.

మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా రద్దు కాగా, రెండో రోజు దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.  సఫారీ కెప్టెన్‌ మార్కరమ్‌(100) సెంచరీకి తోడు బావుమా(87 నాటౌట్‌) సమయోచితంగా ఆడటంతో ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది. ఆ తర్వాత మూడో రోజు ఆటలో భాగంగా బోర్డు ప్రెసిడెంట్స్‌ బ్యాటింగ్‌కు దిగగా ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌లు ఆరంభించారు. ఫిలిండర్‌ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై కాసేపటికి ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన అభిమన్యు ఈశ్వరన్‌(13) కూడా ఔట్‌ కావడంతో బోర్డు ప్రెసిడెంట్స్‌ లంచ్‌ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.

(విజయనగరంలో క్రికెట్‌ సంబరం ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు