ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌ రోహితే!

2 Oct, 2019 18:08 IST|Sakshi

మూడు ఫార్మెట్లనూ సెంచరీ..

విశాఖపట్నం : టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అజేయ సెంచరీ సాధించడం ద్వారా.. మూడు క్రికెట్‌ ఫార్మెట్లలోనూ ఓపెనర్‌గా సెంచరీ సాధించిన మొట్టమొదటి టీమిండియా ప్లేయర్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. 

దక్షిణాఫ్రికాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో డకౌట్‌ అయిన రోహిత్‌.. ఓపెనర్‌గా ఆడిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా రాణించాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెటర్‌గా ఉన్న అపవాదును తొలిగించుకుంటూ.. టెస్టులకు కావాల్సిన ఓపిక, టెక్నిక్‌తో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా తనదైన మార్క్‌ బౌండరీలతో అలరించాడు. దీంతో చాలాకాలం తర్వాత టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్‌ లాంటి ఆటను రోహిత్‌ శర్మ ద్వారా చూసే అవకాశం క్రికెట్‌ అభిమానులకు లభించింది. బుధవారం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రోహిత్‌ శర్మ శతక్కొట్టాడు. టెస్టుల్లో ఓపెనర్‌ వచ్చిన తొలి మ్యాచ్‌లోనే రోహిత్‌ సెంచరీ కావడం విశేషం. 

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ప్రారంభంలో రోహిత్‌తో పాటు మయాంక్‌ సంయమనంతో ఆడారు. క్రీజులో కుదురుకున్నాక చెత్త బంతులను బౌండరీలు తరలించారు. దీంతో లంచ్‌ విరామం వరకే రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు. లంచ్‌ అనంతరం రెచ్చిపోయిన ఓపెనర్లు మరింత దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో మయాంక్‌ అర్దసెంచరీ సాధించాడు. మరోవైపు రోహిత్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో  కేవలం 154 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేశాడు.  మరోవైపు మయాంక్‌ కూడా సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 59.1 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ(115; 174 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు), మయాంక్‌(84 బ్యాటింగ్‌; 183 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు.   

మరిన్ని వార్తలు