‘రోహిత్‌ శర్మనే బెస్ట్‌ కెప్టెన్‌’

20 Apr, 2020 11:59 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రోహిత్‌ శర్మ సారథ్యం అమోఘం అంటూ గంభీర్‌ కొనియాడాడు. ముంబై ఇండియన్స్‌కు ఇప్పటికే నాలుగు టైటిల్స్‌ సాధించి పెట్టిన రోహిత్‌.. క్రికెట్‌ నుంచి తప్పుకునే లోపు ఇంకా రెండు-మూడు టైటిల్స్‌ సాధించి పెడతాడన్నాడు.  2013 సీజన్‌లో రికీ పాంటింగ్‌ నుంచి కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన రోహిత్‌.. అత్యంత సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఎదిగాడు. 2013తో పాటు, 2015, 17, 19 సీజన్లలో ముంబైను రోహిత్‌ చాంపియన్‌గా నిలిపాడు.  (‘వాళ్లిద్దరే అత్యుత్తమ సారథులు.. కోహ్లి కాదు’)

ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన గౌతం గంభీర్‌..‘జట్టును ఎన్నిసార్లు విజేతగా నిలిపామన్న దానిపైనే కెప్టెన్సీ ఆధారపడి ఉంటుంది. ఇది రోహిత్‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. ముంబై ఇండియ‌న్స్ సార‌థిగా అతను నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీ సాధించాడు. కెరీర్ ముగిసేలోగా మ‌రో మూడు టైటిల్స్ గెలుస్తాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ కెప్టెన్‌గా రోహిత్‌ చరిత్రలో నిలుస్తాడు. కనీసం ఆరు నుంచి ఏడు ఐపీఎల్‌ టైటిల్స్‌ రోహిత్‌ తన కెరీర్‌లో సాధిస్తాడు’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.  

ఇక ఐపీఎల్‌లో 104 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన రోహిత్.. 60 విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ఎంఎస్‌ ధోని ప్రథమ స్థానంలో ఉన్నాడు.  ధోని మొత్తం 174 ఐపీఎల్  మ్యాచ్‌లకు గాను 104 విజయాలందించాడు. ఇక గంభీర్ 129 మ్యాచ్‌ల్లో 71 విజయాలతో రెండో స్థానంలో ఉండగా, రోహిత్‌ మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌ ఐపీఎల్‌ పరుగుల పరంగా చూస్తే రోహిత్‌ 4,898 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు