రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్

24 Jan, 2016 16:58 IST|Sakshi
రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్

దుబాయ్: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో విశేషంగా రాణించిన టీమిండియా ఓపెనర్ రోహిత శర్మ తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ ఏకంగా ఎనిమిది స్థానాల పైకి ఎగబాకి ఐదో ర్యాంకును సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ రెండు  అద్భుతమైన సెంచరీల సాయంతో 441 పరుగులను నమోదు చేయడంతో తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకున్నాడు. చివరి వన్డేలో 99 పరుగులు చేసిన రోహిత్ మరో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

 

ఆసీస్ లో రోహిత్ తన వ్యక్తిగత ప్రదర్శనతో 59 పాయింట్లను సాధించి ఐదో ర్యాంకును దక్కించుకోగా, విరాట్ కోహ్లి 64 పాయింట్లు సాధించి తన రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ సిరీస్ ను భారత్ 1-4 తేడాతో కోల్పోయిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏడు స్థానాలు దిగజారి 13వ ర్యాంకు పరిమితమయ్యాడు.ఇక టీమిండియా బౌలర్లలో విషయానికొస్తే టాప్-10లో ఎవరూ లేకపోవడం గమనార్హం. భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ రెండు స్థానాలు దిగజారి 11 వ స్థానానికి పడిపోగా, భువనేశ్వర్ కుమార్ ఏడు స్థానాల పడిపోయి 21వ స్థానానికి పరిమితమయ్యాడు.   కాగా, చివరి వన్డేలో టీమిండియా గెలవడంతో రెండో స్థానాన్ని కాపాడుకుంది.


ఆసీస్ ఆటగాళ్లలో మ్యాక్స్ వెల్ రెండు స్థానాలను మెరుగుపరుచుకుని ఎనిమిదో స్థానానికి చేరుకోగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ , డేవిడ్ వార్నర్ లు మరింత పైకి ఎగబాకి వరుసగా 15,18 ర్యాంకుల్లో నిలిచారు.

మరిన్ని వార్తలు