ఆ మజానే వేరు!

20 Nov, 2018 01:12 IST|Sakshi

ఆస్ట్రేలియాలో గెలవడంపై  రోహిత్‌ శర్మ వ్యాఖ్య 

సవాల్‌కు సిద్ధమన్న వైస్‌ కెప్టెన్‌    

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధించడంలో ఉండే సంతృప్తికి ఏదీ సాటి రాదని భారత వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. ఆతిథ్య జట్టు బౌలర్ల నుంచి ఎదురయ్యే తీవ్ర సవాల్‌ను ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌ సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా బ్రిస్బేన్, పెర్త్‌లలో పరిస్థితులు కఠినంగా ఉంటాయని అన్నాడు. ‘భారత జట్టు ప్రతీ పర్యటనల్లో ఈ రెండు వేదికల్లో ఒక్క చోటైనా ఆడుతూ వస్తోంది. పొడగరి ఆసీస్‌ బౌలర్లు పరిస్థితులను సమర్థంగా ఉపయోగించుకుంటే మాకు సవాల్‌ ఎదురవుతుంది.

మన బ్యాట్స్‌మెన్‌ ఎత్తు తక్కువ కాబట్టి వారిని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈసారి గతంలో ఇక్కడ పర్యటించిన వారితో పాటు ఇతర ఆటగాళ్లు పూర్తిగా సన్నద్ధమయ్యారు. బౌన్స్‌కు అలవాటు పడేందుకే ముందుగా ఆస్ట్రేలియాకు వచ్చాం’ అని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు. ‘జట్టుగా రాణించి మాదైన ముద్ర వేయాలని భావించే చోటు ఆస్ట్రేలియా. పోయినసారి ఇక్కడ రెండు టెస్టుల్లో ఓడినా సిరీస్‌లో గట్టి పోటీనిచ్చాం. ఈసారి ఆ ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకుంటాం.

వరల్డ్‌ కప్‌కు ముందు ఆసీస్‌ గడ్డపై విజయం అంటే ఆత్మవిశ్వాసం అమాంతం పెరగడం ఖాయం. వారిని సొంతగడ్డపై ఓడించడం అంత సులువు కాదు. కాబట్టి ఏ ఒక్కరో కాకుండా జట్టులో అందరూ బాగా ఆడాలి. ముఖ్యంగా మా స్పిన్నర్లతో వారికి సవాల్‌ విసురుతాం. భారత జట్టు రాత మార్చాలని పట్టుదలగా ఉన్నాం’ అని రోహిత్‌ నమ్మకంగా చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాను చాలా బాగా ఆడుతున్నానని...తనకు అసలు సవాల్‌ టెస్టుల్లోనే ఎదురవుతుందని అంగీరించిన ముంబైకర్‌ ప్రస్తుతం మాత్రం పూర్తిగా టి20లపైనే దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు.    

మరిన్ని వార్తలు