రోహిత్‌ శర్మ ఖాతాలో అరుదైన ఘనత

28 Jun, 2018 10:15 IST|Sakshi
రోహిత్‌ శర్మ (పాత చిత్రం)

సాక్షి, స్పోర్ట్స్‌ (డబ్లిన్‌) : టీమిండియా తాము ఆడిన100వ టీ20 మ్యాచ్‌లో భారీ విజయం సాధించగా.. భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20లో భాగంగా ‘హిట్‌ మ్యాన్‌’  రోహిత్‌ శర్మ (61 బంతుల్లో 97; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నా.. పదివేల పరుగుల మైలురాయి(10, 022 పరుగులు)ని అధిగమించాడు. ఐర్లాండ్‌తో నిన్నటి మ్యాచ్‌కు ముందు 9,925 పరుగులతో ఉన్న రోహిత్‌, ఆ మ్యాచ్‌లో 75 పరుగుల వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే భారత ఓపెనర్‌ ఖాతాలో ఈ ఫీట్‌ నమోదైంది. పదివేల పరుగుల క్లబ్‌లో చేరిన అతికొద్దిమంది ఓపెనర్ల జాబితాలో రోహిత్‌కు చోటు లభించింది.

మొత్తం మూడు అంతర్జాతీయ ఫార్మాట్ల (టెస్టులు, వన్డేలు, టీ20లు)లో కలిపి రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. రోహిత్‌ టెస్టుల్లో 1,479 పరుగులు, వన్డేల్లో 6,594 పరుగులు, టీ20ల్లో 1,949 పరుగులు సాధించాడు. వన్డేల్లో 17 శతకాలు బాదిన రోహిత్‌.. టెస్టుల్లో 3, టీ20ల్లో 2 సెంచరీలు బాదాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన అరుదైన ఆటగాళ్లలో రోహిత్‌ ఒకడు కాగా.. మూడుసార్లు ఈ ఫీట్‌ నెలకొల్పిన ఏకైక క్రికెటర్‌గా భారత ఓపెనర్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

సచిన్‌ ఎవర్‌గ్రీన్‌
ఓవరాల్‌గా భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పరుగుల జాబితాలో 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టులు (15,921), వన్డేల్లో (18,426) అత్యధిక పరుగుల రికార్డు సైతం సచిన్‌ పేరిటే ఉంది. సచిన్‌ తర్వాతి స్థానంలో కుమార సంగక్కర 28,016 పరుగులతో ఉన్నాడు. భారత్‌ నుంచి రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోని, మహ్మద్‌ అజారుద్దీన్‌, సునీల్‌ గవాస్కర్‌, యువరాజ్‌ సింగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు