రోహిత్‌పైనే చూపంతా!

26 Sep, 2019 02:28 IST|Sakshi
విజయనగరం సమీపంలోని డాక్టర్‌ పివిజి రాజు ఏసిఏ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ క్రీడా మైదానం

కెప్టెన్‌ హోదాలో బోర్డు ఎలెవెన్‌ను నడిపించనున్న హిట్‌మ్యాన్‌

ఓపెనర్‌గానూ పరీక్షించుకునే అవకాశం

నేటి నుంచి దక్షిణాఫ్రికాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌

విజయనగరంలోని మైదానం వేదిక  

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో లెక్కకు మిక్కిలి రికార్డులు ఖాతాలో వేసుకున్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ ఇప్పుడు కెరీర్‌లో కీలక మలుపులో ఉన్నాడు. తనతో ఇంతకాలం దోబూచులాడుతున్న ‘టెస్టుల్లో చోటు’ను సుస్థిరం చేసుకునేందుకు పెద్ద పరీక్షకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి విజయనగరం శివారులోని డా.పీవీజీ రాజు క్రీడా మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో అటు ఓపెనర్‌గా, ఇటు కెపె్టన్‌గా బోర్డు ఎలెవెన్‌ జట్టును అతడు నడిపించనున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌లో రోహిత్‌... టీమిండియా ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశాలు ఖాయమైన నేపథ్యంలో అందుకుతగ్గ ‘ప్రాక్టీస్‌’ను ఎలా సాగిస్తాడో...

సాక్షి ప్రతినిధి, విజయనగరం
ఒకరివెంట ఒకరు కుర్రాళ్లు దూసుకొస్తున్న తరుణంలో రోహిత్‌కు ఇప్పుడు లభించిన ‘టెస్టు’ అవకాశం బహుశా చివరిదనే భావించాలి. అందులోనూ ఓపెనర్‌గా రానుండటంతో అందరి కళ్లూ అతడిపైనే ఉన్నాయి. ఓ బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ సామర్థ్యంపై ఇంకే అనుమానాలు లేకున్నా... ఎర్ర బంతిని ఎదుర్కొనడంలో తడబాటు అతడిని సంప్రదాయ ఫార్మాట్‌లో సాధారణ ఆటగాడిగా మార్చేసింది. ప్రస్తుతం ఆ వైఫల్యాల జ్ఞాపకాలను చెరిపేసే మార్గం హిట్‌మ్యాన్‌ ముందు నిలిచింది. ప్రత్యర్ధి జట్టులోని మెరుగైన బౌలింగ్‌ వనరులకు ఎదురు నిలిచి రాణిస్తే టెస్టు సిరీస్‌కు ముందు అతడిలో ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయం. మరోవైపు డు ప్లెసిస్‌ సారథ్యంలోని దక్షిణాఫ్రికా మెరుగ్గా సన్నద్ధమయ్యే పనిలో ఉంది.  

ఆ ఇద్దరే ఇక్కడా...
రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బోర్డు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. దక్షిణాఫ్రికాపై మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తరఫున వీరే ఓపెనర్లు. తొలిసారి జోడీగా దిగుతున్న వీరికి రబడ, ఫిలాండర్, ఇన్‌గిడి వంటి సఫారీ బౌలర్లను ముందే ఆడనుండటం సానుకూలాంశం. సమన్వయం రీత్యా కూడా మంచి సన్నాహకం దొరికినట్లే. స్వతహాగా ఓపెనర్లయినా... కూర్పు ప్రకారం ప్రియాంక్‌ పాం చల్, అభిమన్యు ఈశ్వరన్‌లలో ఒకరే బరిలో దిగే వీలుంటుంది. ఇటీవల నిలకడగా ఆడుతున్న కరుణ్‌ నాయర్, సిద్దేశ్‌ లాడ్, ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌లతో బోర్డు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. గాయపడిన బుమ్రా స్థానంలో సఫారీ టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఉమేశ్‌ యాదవ్‌ పేస్‌తో పాటు యువ ఇషాన్‌ పొరెల్, అవేష్‌ ఖాన్‌లు తమ పేస్‌ సత్తా చాటేందుకు ఈ మ్యాచ్‌ ఓ వేదిక. జలజ్‌ సక్సేనా, ధర్మేంద్ర     జడేజా స్పిన్‌తో ప్రొటీస్‌ పని పట్టగలవారే.

అందరూ బరిలోకి...
డు ప్లెసిస్‌ వన్డే ప్రపంచ కప్‌ తర్వాత తొలిసారి మైదానంలోకి దిగుతున్నాడు. అతడికి టెస్టుల్లో స్థానం నిలవాలంటే రాబోయే మ్యాచ్‌లు కీలకం. ఓపెనర్‌ మార్క్‌రమ్‌ ‘ఎ’ జట్టు తరఫున భారీ సెంచరీ కొట్టి ఫామ్‌ చాటాడు. ఎల్గర్, బవుమా, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ డికాక్‌ తదితరులతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది.  చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ ఆడబోతున్న ఫిలాండర్‌ సఫారీల ప్రధాన పేసర్‌. టి20 సిరీస్‌లో విఫలమైన రబడ అసలు సమరం నాటికి పుంజుకోవాలని చూస్తున్నాడు. కేశవ్‌ మహరాజ్, ముత్తుస్వామిల స్పిన్‌ ఏమేరకు సవాల్‌ విసురుతుందో చూడాలి.

వరుణుడు కరుణిస్తేనే...
మొదటిసారి అంతర్జాతీయ సన్నాహక క్రికెట్‌ మ్యాచ్‌కు వేదికవుతున్న ఈ మైదానంలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డు పడేలా ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు పాల్గొంటున్నందున అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ, అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి సైతం వాన పడింది. నిర్వాహకులు మాత్రం వర్షం విరామం ఇస్తే గంటలోనే ఆటను ప్రారంభిస్తామని చెబుతున్నారు.  

ఇరు జట్ల వివరాలు
బోర్డు ఎలెవెన్‌ : రోహిత్‌ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్, ప్రియాంక్‌ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్‌ నాయర్, సిద్దేశ్‌ లాడ్, కేఎస్‌ భరత్, జలజ్‌ సక్సేనా, ధర్మేంద్ర సింగ్‌ జడేజా, అవేష్‌ ఖాన్, ఇషాన్‌ పొరెల్, శార్దుల్‌ ఠాకూర్, ఉమేశ్‌ యాదవ్‌.

దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), బవుమా, డి బ్రుయెన్, డి కాక్, ఎల్గర్, హమ్జా, కేశవ్‌ మహరాజ్, మార్క్‌రమ్, సెనురాన్‌ ముతుస్వామి, ఇన్‌గిడి, నోర్టె, ఫిలాండర్, పీట్, రబడ, రూడీ సెకండ్‌.

మరిన్ని వార్తలు