రోహిత్‌ శర్మ చెత్తరికార్డు.. ట్విటర్‌ ఫైర్‌.!

23 Feb, 2018 08:46 IST|Sakshi
రోహిత్‌ శర్మ (ఫైల్‌ఫొటో)

సాక్షి, స్పోర్ట్స్‌ : దక్షిణాఫ్రికా పర్యటనలో నిలకడలేమి ప్రదర్శనతో తీవ్ర తడబాటుకు గురవుతున్న టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఆతిథ్య జట్టుతో జరిగిన రెండో టీ20లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగి టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాట్స్‌మన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.  ఇప్పటికే పర్యటనలో పేలవ ప్రదర్శనతో అభిమానుల ఆగ్రహానికి గురైన ఈ హిట్‌మ్యాన్‌ తాజా రికార్డుతో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

ఇప్పటి వరకు ఈ చెత్తరికార్డు మాజీక్రికెటర్‌ ఆశిశ్‌నెహ్రా, యూసఫ్‌ పఠాన్‌ల పేరిట సంయుక్తంగా ఉండగా రోహిత్‌ అధిగమించాడు. రోహిత్‌ నాలుగు సార్లు డకౌట్‌ కాగా నెహ్రా, పఠాన్‌లు మూడు సార్లు అవుటయ్యారు. అంతేకాకుండా గోల్డెన్‌ డకౌట్‌ అయిన భారత క్రికెటర్ల జాబితోలోకి సైతం రోహిత్‌ ప్రవేశించాడు. తాజా గోల్డెన్‌ డకౌట్‌తో అంతకు ముందు జాబితాలో ఉన్న కేఎల్‌ రాహుల్‌, అజింక్యా రహానే, మురళి విజయ్‌ల సరసన చేరాడు. ఈ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ చెత్తరికార్డుపై ట్విటర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. ‘రోహిత్‌ దక్షిణాఫ్రిక పర్యటనలో గోల్డెన్‌ డక్‌తో గోల్డ్‌ సాధించావు’..అని ఒకరంటే.. ‘బ్యాట్స్‌మన్‌ ఆఫ్‌దిడే.. రోహిత్‌, బౌలర్‌ ఆఫ్‌దిడే చహల్‌’ అని మరోకరు ట్రోల్‌ చేస్తున్నారు.

మనీష్‌పాండే, ధోనిల అద్భుత ప్రదర్శనతో సఫారీలకు భారీ లక్ష్యమే విధించినా.. చాహల్‌ పేలవ బౌలింగ్‌, క్లాసన్‌ విజృంభణతో భారత్‌ రెండో టీ20లో ఓడిన విషయం తెలిసిందే. ఇక సిరీస్‌ నిర్ణయాత్మక టీ20 శనివారం కేప్‌టౌన్‌ వేదికగా జరగనుంది.

మరిన్ని వార్తలు