మూడేళ్లలో రోహిత్‌ శర్మ తొలిసారి..

27 Dec, 2018 20:04 IST|Sakshi

మెల్‌బోర్న్‌: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ.. టెస్టుల్లో మాత్రం ఇంకా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. అయితే తన కెరీర్‌లో 27వ టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న రోహిత్‌ సుదీర్ఘ కాలం తర్వాత హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆసీస్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో  భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్(63 నాటౌట్‌) అర్థ శతకంతో మెరిశాడు. ఇలా రోహిత్‌ శర్మ ఆసియా వెలుపల హాఫ్‌ సెంచరీ సాధించడం గత మూడేళ్లలో ఇది తొలిసారి. 2014-15 ఆసీస్‌ పర్యటనలో భాగంగా జనవరి నెలలో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.

ఆపై ఇంతకాలానికి ఆసియా ఖండం వెలుపల అర్థ శతకాన్ని సాధించాడు. 2015లో ఆసీస్‌తో మ్యాచ్‌ ఆడిన తర్వాత రోహిత్‌... 2016లో వెస్టిండీస్‌తో ఆ దేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడగా, 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కూడా రెండు మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన రోహిత్‌.. రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక మూడో టెస్టులో నిలకడగా బ్యాటింగ్‌ చేసి హాఫ్‌ సెంచరీ మార్కును చేరాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసిన తర్వాత డిక్లేర్‌ చేసింది.

నువ్వు సిక్స్ కొడితే.. ముంబైకి మారిపోతా..!

మరిన్ని వార్తలు