రోహిత్ శర్మ అరుదైన ఘనత

27 Sep, 2017 16:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా ఓపెనర్ రోహిత్ తన ఫామ్ చాటుకుంటూ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో బాదిన నాలుగు సిక్సర్లతో ఆ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ (61 సిక్సర్లు)ను రోహిత్ (65 సిక్సర్లు) అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ 60 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

2013 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ నాలుగేళ్లలో భారత ఓపెనర్‌గా 79 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 113 సిక్సర్లు బాదాడు. ఈ ఫార్మాట్లో దక్షిణాఫ్రికా విధ్వంసకర క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ 106 సిక్సర్ల (86 ఇన్నింగ్స్‌లు)తో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 95 ఇన్నింగ్స్‌ల్లో 100 సిక్సర్లు బాదాడు.

ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ నాలుగేళ్ల వ్యవధిలో ఓపెనర్‌గా 143 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్‌శర్మ 169 సిక్సర్లు సాధించగా, ఇందులోనూ సఫారీ స్టార్ ప్లేయర్ డివిలియర్స్ 153 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ నాలుగేళ్లలో ఓవరాల్‌గా 160 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 43.28 సగటు, 85.19 స్ట్రైక్ రేట్‌తో 5843 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 13 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు సాధించాడు.

మరిన్ని వార్తలు