‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు 

31 May, 2020 01:00 IST|Sakshi

‘అర్జున’కు ఇషాంత్, ధావన్, దీప్తి శర్మ

ముంబై: భారత స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీ) సిఫారసు చేసింది. ఇషాంత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం బీసీసీఐ నామినేట్‌ చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నుంచి 2019 సంవత్సరానికి ‘వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు పొందిన 33 ఏళ్ల రోహిత్‌... ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ టి20ల్లో నాలుగు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రోహిత్‌ టెస్టు అరంగేట్రంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు.

ఓవరాల్‌గా రోహిత్‌ ఇప్పటివరకు 224 వన్డేలు, 108 టి20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు. 2010లో అరంగేట్రం చేసిన శిఖర్‌ ధావన్‌ 136 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 31 ఏళ్ల ఇషాంత్‌ శర్మ భారత్‌ తరఫున 97 టెస్టులు ఆడి 297 వికెట్లు... 80 వన్డేలు ఆడి 115 వికెట్లు తీశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (188 పరుగులు) చేసిన మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. దీప్తి వన్డేల్లో 64 వికెట్లు, టి20ల్లో 53 వికెట్లు పడగొట్టింది.

మరిన్ని వార్తలు