బంగ్లా బౌలింగ్‌తో చదరంగం ఆడేశాడు!

3 Jul, 2019 08:19 IST|Sakshi

రోహిత్‌ శర్మపై ప్రశంసల జల్లు

ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూకుడు సాటిలేనిరీతిలో సాగుతోంది. వరల్డ్‌కప్‌లో వరుస సెంచరీలతో చెలరేగుతున్న ఈ హిట్‌మ్యాన్‌.. ఒక ప్రపంచకప్‌లో అత్యధికంగా నాలుగు శతకాలు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ 104 పరుగులు చేయడంతో.. కీలకమైన ఈ పోరులో భారత్‌ 28 పరుగులతో అలవోకగా విజయాన్ని సాధించింది. వన్డేల్లో 26వ సెంచరీ చేసిన రోహిత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అయిన రోహిత్‌పై సారథి విరాట్‌ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. అతడి బ్యాటింగ్‌ స్టైల్‌ అద్భుతమని, ప్రపంచంలోనే అతను ఉత్తమ వన్డే ప్లేయర్ అని కితాబిచ్చాడు.

ఇక మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రోహిత్‌ను ప్రశంసలతో ఆకాశానికెత్తాడు. ఎంతో పరిణతి గల ఆటగాడిగా రోహిత్‌ ఎదిగాడని, ఆటను మెరుగ్గా అర్థం చేసుకుంటూ అతను అద్భుతంగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. ‘బంగ్లాదేశ్‌ బౌలింగ్‌తో రోహిత్‌ చందరంగం ఆడాడు. వాళ్లు ఎక్కడ బంతులు విసురుతారో ముందే పసిగట్టాడు’ అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్‌లో 9 పరుగుల వద్ద రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను తమిమ్‌ ఇక్బాల్‌ వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో పలుసార్లు ఇదేవిధంగా లైఫ్‌లు పొందిన రోహిత్‌.. వాటిని సద్వినియోగం చేసుకొని భారీ స్కోరులుగా మలిచిన సంగతి తెలిసిందే. క్యాచ్‌లే మ్యాచ్‌లను గెలిపిస్తాయని, కాబట్టి రోహిత్‌ వంటి క్లాసీ బ్యాట్‌మన్‌ క్యాచ్‌ను వదిలేయడం ఏ జట్టు అంత శ్రేయస్కరం కాదని సచిన్‌ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్‌ ఆరంభ సమయంలో రోహిత్‌ కొంత నిలకడ చూపలేకపోతున్నాడని, రోహిత్‌ను ఔట్‌ చేయాలంటే ఆరంభమే మంచి సమయమని పేర్కొన్నాడు.
 
జోరు, భారత్‌ స్కోర్లను చూస్తుంటే ఇక టీమిండియాకు తిరుగులేదనే అనిపిస్తుంది. తాజాగా బంగ్లా పనిపట్టింది. చక్కగా సెమీఫైనల్‌ చేరింది. ఈ టోర్నీలో మేటి జట్లకు దీటుగా రాణిస్తున్న బంగ్లాదేశ్‌ ఆట లీగ్‌ దశలోనే ముగిసింది. ఇక కోహ్లి సేన లక్ష్యం అగ్రస్థానంలో నిలవడమే! ఆఖరి మ్యాచ్‌లో లంకను ఓడిస్తే సెమీస్‌ పరీక్షను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చని భావిస్తోంది.  

మరిన్ని వార్తలు